Cheating | ములుగు, (నమస్తేతెలంగాణ) : నమ్మిన రైతులను నట్టేట ముంచాడో అడ్తివ్యాపారి. రూ.కోటీ 62 లక్షలతో ఉడాయించడమే గా క సదరు రైతులకు ఐపీ నోటీసులు పంపిన ఉ దంతం కాసిందేవిపేటలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
బాధిత రైతుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా కాసిందేవిపేటకు చెందిన మహ్మద్ ఇబ్రహీం పదేళ్లుగా కాసిందేవిపేటతోపాటు రామయ్యపల్లి, దేవగిరిపట్నం, జంగాలపల్లి, ఇంచర్ల, బరిగలానిపల్లి, వెంకటాపూర్ మండలంలోని రామాంజాపూర్, గుంటూరుపల్లి, భూపాలపల్లి మండలం కొంపెల్లి గ్రామాలకు చెందిన రైతుల వద్ద నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాడు. గత సంవత్సరం జనవరిలో ఆయా గ్రామాల రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన ఇబ్రహీం వారి చెల్లించాల్సిన కోట్లాది రూపాయలు ఇవ్వకపోవడంతోపాటు కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన బాధిత రైతులు ములుగు పోలీసులకు ఫిర్యాదు చేయగా రెండు కేసులను నమోదు చేసి ఇబ్రహీం కోసం తీవ్రంగా గాలించారు.
2022 మార్చి 14వ తేదీన దేవగిరిపట్నం గ్రామానికి చెందిన మారంరెడ్డి సుభాష్‌రెడ్డి ఫిర్యాదుపై ఒక కేసు, అదే సంవత్సరం మే నెల 8న వంశీధర్‌రెడ్డి అనే రైతు ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసు ఇబ్రహీంపై నమోదయ్యాయి. ఈ క్రమంలో పలుమార్లు జిల్లా కేంద్రంలో రాస్తారోకోలు నిర్వహించి, పోలీస్ ఉన్నతాధికారులతో పాటు డీజీపీ వరకు విషయాన్ని తీసుకెళ్లారు. అయినప్పటికీ ఇబ్రహీం జాడను పోలీసులు కనుగొనలేకపోయారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అన్ని గ్రామాలకు చెందిన 138 మంది రైతులకు ములుగు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి ఐపీ దాఖలు చేసినట్లు నోటీసులు పంపాడు. ఈ నెల 20న ములుగు కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులను చూసిన రైతులు నివ్వెరపోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పంట ఉత్పత్తులతో పాటు అప్పు గా ఇచ్చిన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇబ్రహీం 138 మంది రైతులకు రూ. కోటి 62 లక్షల 32 వేలు బాకీ ఉన్నట్లుగా పేర్కొని, తనకు 91 మంది రైతుల వద్ద నుంచి రూ. 35 లక్షల 75 వేలు రావాల్సి ఉందని నోటీసుల్లో పేర్కొన్నాడు. కాగా, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతోనే తాము ఐపీ నోటీసులు అందుకోవాల్సి వచ్చిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా ఊరి బిడ్డ అనుకున్నం. మనోడు అని నమ్మినం. ఏడాది నుంచి మా డబ్బుల కోసం తిరుగుతూనే ఉన్నం. జాడ లేదు.. పత్తా లేదు. ఫోన్ నంబర్ కూడా లేదు. వాళ్ల బంధువులకు తెలియదని చెప్పారు. ఇప్పుడు కోర్టు నుంచి నోటీసులు పంపు డు న్యాయమేనా. ఇయాల రేపు న్యాయం ఎక్కడున్నది. చుట్టూ పది ఊరోళ్లను నమ్మించి మోసం చేసిండు. పంట పైసలే కాకుండా బాకీలు తీసుకున్న పైసలు కూడా ఎవరికీ ఇయ్యలేదు. ములుగుకు పోయి పోలీసులను కూడా కలిసినం. రోడ్డు మీన కూసోని లొల్లి చేసినం. 10 ఏండ్ల కష్టం ఇబ్రహీం పాలైంది. మాకు ఎక్కడా న్యాయం జరగలే . కోర్టే మాకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నా.
-పొల్నేని విమలమ్మ, బాధిత రైతు,కాసిందేవిపేట