ఏటూరునాగారం, ఆగస్టు 8 : గిరిజన గూడేల్లో ప్రగతి వెలుగులు విరజిమ్ముతున్నాయి. అడవులు, మారుమూల ప్రాంతాల్లో అడవిబిడ్డల అభివృద్ధికి ప్రభుత్వం ఐటీడీఏ లను ఏర్పాటు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఏటూరునాగారం ఐటీడీఏ కేంద్రం గిరిజనుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాడునందిస్తోంది. వ్యక్తిగత రుణాలు, మహిళలతో పరిశ్రమల ఏర్పాటు, సబ్సిడీపై వాహనాలు, విదేశీ విద్యకు ప్రోత్సాహం అందిస్తూ బాసటగా నిలుస్తోంది. పోడు చేసు కుంటున్న గిరిజన రైతులకు హక్కు పత్రాలు అందించి రైతు బంధునూ అందజేస్తున్నది. నేడు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులపై ప్రత్యేక కథనం.
గిరిజనుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ విద్య, వైద్య, వ్యవసాయం, పారిశ్రామిక, ఉపాధి రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలనే సమాలోచనతో 1982లో ప్రపంచ ఆదివాసీల దినోత్సవం నిర్వహించేలా ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. అప్పటి నుంచి అడవిబిడ్డల అభివృద్ధికి మరిన్ని బాటలు పడ్డాయి. ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఆదివాసీ సంఘాలతోపాటు ప్రభుత్వాలు శ్రీకారం చుడుతున్నాయి. వారి హక్కులు, చట్టాలను కాపాడే విధంగా ఉత్తర్వులను జారీ చేశారు ఆదివాసీలు ఏటా ఆదివాసీ దినోత్సవాన్ని పల్లెపల్లెనా నిర్వహిస్తున్నారు. అడవులు, మారుమూల ప్రాంతాలకే పరిమితమైన గిరిజనులను అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏలను నెలకొల్పింది.
గూడుకే పరిమితమైన మహిళలను పారిశ్రామిక రంగంలో వడివడిగా అడుగులు వేయిస్తోంది. గిరిజన విద్యా వికాస కేంద్రాలకు పరిమితమైన విద్యను విదేశాల వరకు తీసుకెళ్లింది. బెస్ట్ అవైలబుల్ స్కీం, కాలేజ్ హాస్టల్స్‌ను ఏర్పాటు చేసింది. అలాగే వైద్యం అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. పోడు రైతులకు రైతుబంధు, యువతకు ఉపాధిలో శిక్షణ, గ్రామీణ ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం, జీసీసీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌లు, పరిశ్రమలు, రైతులు సొంతంగా నడిపించుకునే కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ఎకనమికల్ సపోర్టు స్కీం కింద ఉపాధి, గిరివికాస్తో రైతుల భూములకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో ఐటీడీఏ విశేష కృషిచేస్తోంది. గిరిజనులు ఆర్థికంగా ఎదిగేందుకు సహాయ సహకారాలు అందించడంతో పాటు నేటి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా దూసుకుపోయేలా ప్రోత్సహిస్తున్నది. కరోనా సమయంలో సుమారు రూ.10లక్షల నిత్యావసర కిట్లును అందించి పేద కుటుంబాల ఆకలి తీర్చింది.
రూరల్ ట్రాన్స్పోర్ట్ కింద వాహనాలు
గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపర్చడంతో పాటు యువతకు ఉపాధి కల్పించేందుకు గిరిజన సంక్షేమ శాఖ రూరల్ ట్రాన్స్పోర్ట్ స్కీమ్‌ను కూడా అమలు చేస్తున్నారు. డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడంతోపాటు వారికి సబ్సిడీపై వాహనాలు అందిస్తున్నారు. ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాలో 195 మందికి రూ.5.61 కోట్లు సబ్సిడీ రాగా, ఇప్పటికే 112 మందికి రూ.3.13 కోట్ల సబ్సిడీతో గత డిసెంబర్లో వాహనాలు పంపిణీ చేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేరకు రవాణా సౌకర్యం మెరుగైంది.
స్వయంఉపాధి కోసం ఈఎస్ఎస్
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజనులకు ఈఎస్ఎస్(ఎకనమికల్ సపోర్ట్ స్కీం) వ్యక్తిగతంగా లబ్ధిపొందేలా అనేక యూనిట్లు అందిస్తోంది. ఇప్పటికే వేలకొద్దీ ఇవ్వగా ఇటీవల 3,233 మందికి రూ.35.82 కోట్ల సబ్సిడీతో యూనిట్లు అందించారు. ఈ పథకానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 1264 యూనిట్లకు రూ. 11.66 కోట్ల సబ్సిడీని కేటాయించింది. ఈ పథకం కింద లబ్ధి పొందడానికి ఉమ్మడి జిల్లా నుంచి ఏకంగా 26,298 దరఖాస్తులు రావడం విశేషం.
17వేల మంది గిరిజనులకు రైతుబంధు
అడవిబిడ్డలకు వ్యవసాయంలో అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధును అందిస్తున్నది. పెట్టుబడికి అవసరమైన ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కించింది. ఎంతోకాలంగా పోడు చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలను అందించి, వాటి సాగుకు అవసరమైన రైతుబంధును కూడా అందిస్తున్నది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 17,175 మంది రైతులకు చెందిన 49,944 ఎకరాలకు రూ.24.97 కోట్లను బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నది. ములుగు జిల్లాలో 5,428 రైతులకు 15,155 ఎకరాలకు రూ.7,57,76,550, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1387 మందికి 2582 ఎకరాలకు రూ.1,29,10,700, వరంగల్ రూరల్ జిల్లాలో 1974 మందికి 5385 ఎకరాలకు రూ.2,69,,28,650, మహబూబాబాద్ జిల్లాలో 8386 మంది రైతులకు 26,821 ఎకరాలకు రూ.13,41,07,650లను అందిస్తున్నది.
‘ఎఫ్‌పీవో’తో మరింత ప్రోత్సాహం
రైతులను మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, గోదాములు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఎఫ్‌పీవో(ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్)లను ఏర్పాటుచేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 11 ఆర్గనైజేషన్లు ఉండగా, ఒక్కో ఎఫ్‌పీవో కింద 500 మంది వరకు రైతులుంటారు. ఒక్కో యూ నిట్ కింద ట్రైకార్ ద్వారా రూ.60 లక్షల వరకు మంజూరు చేస్తున్నా రు. ఇందులో రూ.36 లక్షల వరకు సబ్సిడీ ఉండగా, రూ.18లక్ష లు బ్యాంకు రుణం, పది శాతం ఆర్గనైజేషన్ కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఏడు ఎఫ్‌పీవోలకు నిధులు విడుదలు చేయగా మిగతా వాటి కోసం ప్రతిపాదనలు పంపా రు. ములుగు జిల్లాలో రామచంద్రాపురం, తాడ్వాయి మండలం మేడారంలో మన్నెం, గోవిందరావుపేట మండలం సమ్మక్క సారలమ్మ, జనగామ జిల్లాలో జైకిసాన్, కుసుంబాయి, వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలో జాంబవ ఆర్గనైజేషన్లకు నిధులు విడుదల చేశారు. మహబూబాబాద్ జిల్లా మచ్చర్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచ, వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట, ములుగు జిల్లాలో మరొకటి ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు.
మహిళల ఉపాధికి పరిశ్రమలు..
గిరిజన ప్రాంతాల్లో మహిళలను పారిశ్రామికంగా తీర్చిదిద్దేందుకు ఐటీడీఏ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జేఎల్‌జీ గ్రూపులను ఏర్పాటుచేసి ఒక్కో యూనిట్‌కు రూ.40 లక్షల చొప్పున నిధులు విడుదల చేసింది. ఏటూరునాగారం మండలం శివ్వాపూర్‌లో రూ.40 లక్షలతో డిటర్జెంట్ సోప్ యూనిట్, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో రూ.40లక్షలతో దాల్ మిల్లు, ఏటూరునాగారంలో రూ.40లక్షలతో డ్రై మిక్స్ యూనిట్, ములుగు మండలం జంగాలపల్లిలో రూ.27.50 లక్షలతో శానిటరీ నాప్కిన్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమలతో సుమారు 100 మందికి ఉపాధి లభించింది. ఇవేగాక ఏటూరునాగారంలో రూ.26లక్షలతో ఫ్లైయాష్ బ్రిక్ యూనిట్, గోవిందరావుపేట మండలం పస్రాలో రూ.12లక్షలతో కాంక్రీట్ మిషన్, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దొరవారిపాలెంలో రూ.18 లక్షలతో సెంట్రింగ్ యూనిట్, పొగుళ్లపల్లిలో రూ.37.50 లక్షలతో కాంక్రీట్ మిక్సింగ్ యూనిట్, ములుగులో రూ.18 లక్షలతో పేపర్ బ్యాగ్ మేకింగ్ యూనిట్లను త్వరలో ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
అనేక రంగాల్లో యువతకు శిక్షణ
ఏటూరునాగారం, జాకారం, కాటారం, హన్మకొండలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా యువతకు వివిధ రకాల కంప్యూటర్ కోర్సులతో పాటు ఎకనమికల్ సపోర్టు స్కీం నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్ల సమయంలోనూ అర్హులైన నిరుద్యోగులను ఎంపిక చేసేందుకు శారీరక దారుఢ్య, పోటీ పరీక్షలపై శిక్షణ ఇచ్చారు. 2017-18లో 175మందికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల కోసం, 2018-19లో 250 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక కోసం ట్రైనింగ్ ఇచ్చారు. 2017-18 నుంచి ఇప్పటి వరకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం ద్వారా 1,700 మంది శిక్షణ పొందారు. ఈ సమయంలో అపోలో మెడిసిన్, కాలీ హెల్త్, జీవీకే, హెటిరో డ్రగ్స్, రిలయన్స్, వీకేర్ హెల్త్, ఎస్ఎస్ బయోటెక్ ఫర్టిలైజర్స్ కంపెనీలు జాబ్‌మేళాలు నిర్వహించి ఉపాధి కల్పించాయి.