– న్యాయవాది నరేష్, అతని కుటుంబ సభ్యులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి
– నల్లగొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి, మంద నాగేశ్
రామగిరి, ఫిబ్రవరి 19 : నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న అత్యంత దారుణ ఘటన న్యాయ వృత్తి గౌరవాన్ని, న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని తీవ్రంగా కలిసి వేసిందని నల్లగొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి, మంద నగేశ్ అన్నారు. న్యాయవాది జి.నరేశ్ నివాసంపై కొంతమంది దుండగులు దాడి చేసి ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా హత్యాయత్నానికి కూడా వెనుకాడకపోవడం అమానుషమైన చర్య అన్నారు. నరేశ్ భార్య, చిన్న కూతురిపై విచక్షణారహితంగా దాడి చేయడం మనసును కలచివేసే ఘటన అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదని న్యాయవృత్తి పట్ల ఉన్న ద్వేష భావనకు, న్యాయ పరిరక్షణ వ్యవస్థపై ఉన్న సవాల్‌కు స్పష్టమైన నిదర్శనం అన్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం రాత్రి నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ కి ఫిర్యాదు అందజేశారు. దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా గురువారం నల్లగొండ జిల్లా బార్ అసోసియేషన్ పిలుపు మేరకు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి జిల్లా కోర్టు సముదాయం నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి మాట్లాడుతూ గత ఐదారు సంవత్సరాలుగా న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిరంతరం పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒకచోట న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి, న్యాయపాలనకు ముప్పు అన్నారు.

‘న్యాయవాద రక్షణ చట్టం బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి’
ఇటీవల చేవెళ్లలో మహిళా న్యాయవాదిని హత్య చేయడం, హైదరాబాద్‌లో మరో న్యాయవాదిపై హత్య ఘటన, ఇప్పుడు నల్లగొండలో జరిగిన దాడి ఇవన్నీ కలిసి న్యాయవాదుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయన్నారు. న్యాయవాదులపై దాడి అంటే న్యాయ వ్యవస్థపై దాడి చేసినట్లే అన్నారు. న్యాయవాదులు భయాందోళనల మధ్య వృత్తి నిర్వహించాల్సి వస్తే సామాన్య ప్రజలకు న్యాయం ఎలా అందుతుందన్నారు. కాబట్టి, తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల హక్కుల రక్షణకు సంబంధించిన చట్టంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయసభల్లో “న్యాయవాదుల రక్షణ చట్టం” బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల భద్రత, గౌరవం కాపాడకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు జి.వెంకటేశ్వర్లు, ఎస్ ఆర్ ఠాగూర్, జె.భాస్కర్ రెడ్డి, ఎం. నాగిరెడ్డి, టి.కిషోర్ కుమార్, పి.శేఖర్, జనిగల రాములు, జి.ఎన్.ఎస్ ప్రసాద్, అన్నపూసల ఐలయ్య, బి.అశోక్ కుమార్, మేక యాదగిరి రెడ్డి, ఎం.ప్రమీల, ఎన్.భాగ్యమ్మ, టి.వరుణ శ్రీ, ఎ.వెంకట్ రెడ్డి, కొండ శ్రీనివాస్, బి.మధు, ముక్కెర శ్రీనివాస్, కామేష్, ఎంవి రమేష్, సల్లా నరేష్, బి.సైదులు, బి.స్వామినాథ్, కొలగాని నిఖిల్ యాదవ్, ఆవుల ప్రేమ్ సుందర్, పందుల సైదులు, సయ్యద్ అఫ్రోజ్, జోగు నగేష్, కుర్ర యాదగిరి, కే.శంకరయ్య, అర్జున్ కుమార్ పాల్గొన్నారు.