ములుగు, అక్టోబర్24(నమస్తేతెలంగాణ)/భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 24: ‘రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాల్సిందే.. లేదంటే కేంద్ర ప్రభుత్వ పతనం తప్పదు.. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన దాఖలాల్లేవు’ అని ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి మండిపడ్డారు. కేంద్రం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాల నేపథ్యంపై తీసిన ‘రైతన్న’ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా కేంద్రాల్లో సీపీఐ, సీపీఎం నా యకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అంతకు ముందు జయశంకర్ జిల్లాకేంద్రంలోని సింగరేణి అతిథిగృహంలో ‘నమస్తే’తో మాట్లాడారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలతో వ్యవసాయరంగం పూర్తిగా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తుందని, రైతు తాను పండించిన పంటను సొంతంగా అమ్ముకునే అవకాశం ఉండదన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు కూడా కేంద్ర చట్టాల కారణం బంద్ అయ్యే అవకాశం ఉందన్నారు. విద్యుత్ సంస్కరణల చట్టంతో తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంటు ఉండబోదన్నారు. ప్రతి వ్యవసాయ బావికి కరంటు మీటరు పెడుతారని, బిల్లు కట్టకుంటే కరంటు కట్ చేస్తారని, నీరందక పొలం ఎండిపోయి రైతు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒకే దేశం..ఒకే మార్కెట్ ఏమిటి..ఇదేమైనా అమెరికానా’ అని ప్రశ్నించారు.
అమెరికాలో మెకనైజేషన్తో వేలాది ఎకరాలు ఉన్న రైతులు పంట పండిస్తారు కాబట్టి వారు ఎలాంటి సంస్కరణలనైనా తట్టుకుంటారని చెప్పారు. ఇక్కడ అంద రూ సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని ఇక్కడ ఎలా సాధ్యమని నిలదీశారు. 2006లో ఇదే విధానాన్ని బీహార్లో అమలు చేస్తే ఒక్క రైతుకూడా లేకుండా పోయాడని, ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, విమాన, నౌకాయానం, రైల్వే, బీమా కంపెనీలు, బొగ్గు పరిశ్రమలు ఇలా అన్నింటినీ కేంద్రం ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తొమ్మిది నెలలుగా ఢిల్లీలో రైతులు పోరాటాలు చేస్తున్నారని, 600 మంది చనిపోయినా కేంద్రంలో చలనం లేదని మండిపడ్డారు.
రెండేళ్లుగా కరోనాతో అందరూ మాస్కులు, శానిటైజర్లు వాడినా రైతు మాత్రం అవేమీ పట్టకుండా భూమిని నమ్ముకుని పంటలు పండిస్తున్నాడని గుర్తు చేశారు. యూపీలో నేడు కొనుగోలు కేంద్రాలు లేక రైతులు పండించిన ధాన్యాన్ని తగలబెట్టుకునే దుస్థితికి వచ్చారని, ఇది బాధాకరమైన ఘటన అన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని స్పష్టం చేసినా తెలంగాణలో సీఎం కేసీఆర్ ఊరువాడలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ రైతులను ఆదుకుంటున్నారని, కేసీఆర్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.
ప్రపంచంలోనే కెనడాలో అత్యంత పెద్ద ఎత్తిపోతల పథకం ఉందని, దానికి మించి కేసీఆర్ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కెనెడా రికార్డును బద్దలుకొట్టారన్నారు. ఇది దేశం కట్టిన ప్రాజెక్టు కాదని, ఒక రాష్ట్రం కట్టిన ప్రాజెక్టు అన్నారు. దీంతో తెలంగాణ ఒక అక్షయపాత్రలా మారిందన్నారు. తాను నిర్మించిన ‘రైతన్న ’ సినిమాలో ఇదంతా కళ్లకు కట్టినట్లుగా చూపించినట్లు చెప్పారు. ప్రతి రైతు ఈ సినిమా చూడాలని, తాను 50 ఏళ్లుగా సినిమాలు నిర్మిస్తున్నానని, ఏనాడూ ఇలా ప్రజల మధ్యకు వచ్చి సినిమా చూడాలని అభ్యర్థించలేదన్నారు. కేంద్రం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాల సినిమా చూడాలనే అన్ని జిల్లాలు తిరుగుతూ కోరుతున్నానని వివరించారు. సమావేశాల్లో సీపీఎం ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి, సీపీఐ, సీపీఎం జయశంకర్ భూపాలపల్లి నాయకులు మోటపలుకుల రమేశ్, బంధు సాయిలు పాల్గొన్నారు.