హనుమకొండ, జూలై 16 : స్థానిక సంస్థల ఎన్నికలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఖరారు చేసింది. ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఖరారైన లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో జడ్పీలు 6, జడ్పీటీసీలు 75, ఎంపీపీలు 75, ఎంపీటీసీలు 778 ఉన్నాయి. అలాగే 75 మండలాల పరిధిలో 1,708 జీపీలు, 15,006 వార్డులు, 15,021 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.
ములుగు, జూలై 16 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల్లో అత్యల్పంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 9 మండలాలతో ఏర్పడిన ములుగు జిల్లాలో ఇటీవలి కాలంలో 10వ మండలంగా జేడీ మల్లంపల్లి మండలం ఆవిర్భవించింది. 10 జడ్పీటీసీ, 10 ఎంపీపీ స్థానాలతో పాటు అత్యల్పంగా 83 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటయ్యాయి. ఇతర జిల్లాలతో పోల్చితే రాష్ట్రంలోనే ములుగు జిల్లా అత్యల్ప జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలున్నాయి.