కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ పురస్కారాల పోటీకి అడవుల ఖిల్లా బరిలో నిలిచింది. ములుగు జిల్లాలోని 174 జీపీలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. తొమ్మిది విభాగాల్లో ప్రతిభ చూపేలా అభివృద్ధి, సంక్షేమం, పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందుకోసం కలెక్టర్ కృష్ణ ఆదిత్య విశేష కృషి చేస్తున్నారు. 15శాఖల సహాయంతో గ్రామాల అభివృద్ధి అంశాలను జాతీయ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. నెల రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. మరో వారం రోజుల్లో ఎంపీవోల పర్యవేక్షణలో కార్యదర్శులు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జాతీయ స్థాయిలో ప్రథమ స్థానానికి రూ.50 లక్షలు, ద్వితీయ రూ.40 లక్షలు, తృతీయ రూ.30 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని కేంద్రం అందించనున్నది. మూడు విభాగాల్లో కేంద్రం మొత్తం 81 జీపీలకు పురస్కారాలను ప్రకటించనున్నది.
ములుగు, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : అడవుల జిల్లా ములుగు జిల్లా పచ్చదనంతో పాటు పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. కలెక్టర్ కృష్ణఆదిత్య జిల్లాలోని పంచాయతీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. తొమ్మిది విభాగాల్లో పంచాయతీలు పురస్కారాలు అందుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పల్లె ప్రగతిలో భాగంగా గ్రామ గ్రామాన హాబిటేషన్ వారీగా పల్లె ప్రకృతి వనాలు, ఇంటింటికీ మరుగుదొడ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఇంకుడు గుంతల నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. వీటితో పాటు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న అన్ని గ్రామాల్లో జిల్లాను సందర్శించే పర్యాటకుల కోసం పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం సైతం పూర్తయింది. జిల్లాలోని 174 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రతి జీపీ నుంచి పురస్కారానికి దరఖాస్తు చేశారు. ఇందు కోసం ఎంపీవోలు, ఎంపీడీవోలు, కార్యదర్శులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రంలో విడుతల వారీగా అవార్డుల దరఖాస్తు విధానాన్ని తెలిపారు. 15 శాఖల సహాయంతో పురస్కారాలకు సంబంధించిన పోర్టల్‌లో గ్రామాల అభివృద్ధి అంశాలను అప్లోడ్ చేస్తున్నారు. గడిచిన నెల రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మరో వారం రోజుల్లో ఎంపీవోల పర్యవేక్షణలో కార్యదర్శులు ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
జాతీయ పోర్టల్‌లో నివేదికలు అప్లోడ్
జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకునేందుకు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో తొమ్మిది విభాగాల్లో పురోగతి సాధించి ఉండాలి. పేదరిక నిర్మూలనకు ఉపాధి కార్యక్రమాలు, గ్రామంలో వైద్య సేవలు, అంగన్వాడీ సెంటర్, నీటి ఎద్దడి లేకుండా తాగు నీటి సౌకర్యం, గ్రామాల్లోని అంతర్గత వీధుల్లో పరిశుభ్ర వాతావరణం, పంచాయతీ పాలకవర్గాల సుపరిపాలన, మహిళలకు స్వయం ఉపాధి పథకాలు కల్పించిన జీపీలకు అవార్డులు వరించనున్నాయి. వీటిని గ్రామ కార్యదర్శులు ఆయా గ్రామాల్లో సాధించిన ప్రగతిని జాతీయ పోర్టల్‌లో అప్లోడ్ చేయనున్నారు. విడుతల వారిగా అమలు చేసిన పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారాయి. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్టు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటు చెత్త ఎత్తేందుకు, మొక్కలకు నీరు అందించేందుకు ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీలు అందుబాటులో ఉన్నాయి. హరితహారంలో భాగంగా గ్రామాల్లో పచ్చదనం పెరిగింది. గతంలో జిల్లాలోని గ్రామాలు అవార్డులను సొంతం చేసుకున్నాయి. మునుముందు జాతీయ పురస్కారాలు సొంతం చేసుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఒకటో స్థానంలో నిలిచిన జీపీకి రూ.50 లక్షలు, రెండో స్థానంలో జీపీకి రూ.40 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన జీపీ రూ.30 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం అందించనున్నది. మూడు విభాగాల్లో కేంద్రం మొత్తం 81 పంచాయతీలకు పురస్కారాలను ప్రకటించనుంది. పంచాయతీ కార్యదర్శులు అప్లోడ్ చేసే పత్రాల పర్యవేక్షణకు మండల స్థాయిలో ఎంపీడీవో కన్వీనర్‌గా, జిల్లా స్థాయిలో కన్వీనర్‌గా డీపీవో, చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు.
పురస్కారాల సొంతానికి కృషి..
పల్లె ప్రగతి పనుల ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలు అభివృద్ధి సాధించాయి. స్వచ్ఛత, పచ్చదనం, పరిశుభ్రత అంశాల్లో జీపీలు ముందంజలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ని నిధులను వినియోగించుకొని ఎంతో అభివృద్ధి సాధించాం. ఇప్పటికే జాతీయ పురస్కారాలకు సంబంధించిన నివేదికలను అప్లోడ్ చేయించాం. జాతీయ స్థాయిలో పంచాయతీ అవార్డులు సాధించేందుకు కృషి చేస్తున్నాం.
– ఎస్ కృష్ణ ఆదిత్య, ములుగు కలెక్టర్