కన్నాయిగూడెం, నవంబర్ 4 : ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేందుకే ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగానని బడే నాగజ్యోతి అన్నారు. శనివారం ఆమె కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం, లక్ష్మీపురం, దేవాదుల, రాజన్నపేట, కన్నాయిగూడెం, గుర్రేవుల, ముప్పనపల్లి, బుట్టాయిగూడెం, కొత్తూరు, చింతగూడెం, ఏటూరు, సింగారం, కంతనపల్లి గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ ‘నేను మీ ప్రభాకరన్న బిడ్డను, మీ అభీష్టం మేరకే మీ సేవలో ప్రాణాలు అర్పించాడు. ఆయన ప్రాణంగా నేను ఇప్పుడు మీ ముందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చాను. గెలిపించి అసెంబ్లీకి పంపించండి.’ అని కోరారు. కాంగ్రెస్ నాయకుల్లా తనకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవని తెలిపారు. ఎమ్మెల్యే సీతక్కలా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంట్రాక్టులు, తొమ్మిదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో పొంది న కమీషన్లు లేవన్నారు. ఒక్క సారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని నాగజ్యోతి భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ నాయకులు పగటి వేషగాళ్ల మాదిరి ఆరు గ్యారెంటీల పేరుతో ఓట్లను దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి మాయమాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు.
గోదావరి అవతల ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు అమలు చేయడం లేదని, అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో ఎలా అమలు చేస్తారన్నారు. తాను గెలువగానే ఇల్లు లేని ప్రతి పే ద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. మండలంలో గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు అందించడంతో పాటు అసైన్డ్ భూములపై పూర్తి హక్కులను కల్పించేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫె స్టోలో పొందుపర్చారని చెప్పారు. అలాగే మండల ప్రజల అభీష్టం మేరకు మండలకేంద్రంలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఏర్పాటుకు కృషి చేస్తానని నాగజ్యోతి హామీ ఇచ్చారు. ప్రచారంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య, ఏటూరునాగారం మండల అధ్యక్షుడు గడదాసు సునీల్‌కుమార్, సీనియర్ నాయకులు కావిరి చిన్నికృష్ణ, మటం వెంకటేశ్, పూజారి కిశోర్, కుందారపు శ్రీనివాస్, సర్పంచులు అల్లెం ప్రభాకర్, కోరం సూర్యనారాయణ, కొట్టె ఉమామహేశ్వరి, కావిరి పద్మ, పూజారి లలిత, నారాయణ, సిద్దబోయిన సాగర్ పాల్గొన్నారు.