మహబూబాబాద్, మార్చి 11 : 14 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని మాజీ సీఎం, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారని మహబూబాబాద్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అన్నీ ఫ్రీ అనగానే ప్రజలు వారి మాయలో పడ్డారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసిందని, ప్రాజెక్టులో మూడు పిల్లర్లకు పగుళ్లు వస్తే మరమ్మతు చేయాల్సింది పోయి కేసీఆర్ చుట్టూ రాజకీయం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని నమ్మి ఓట్లు వేసి ప్రజలు కష్టాలను కొని తెచ్చుకున్నారని అన్నారు. అపర భగీరథుడు కేసీఆర్ ఓడిపోగానే నీటి కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా పాలన చేసిన కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి విషం చిమ్ముతున్నారని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమైందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ఘనత బీఆర్ఎస్కు దక్కకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకృతి వైపరీత్యంతో పిల్లర్లు కుంగితే.., నాణ్యతా లోపమని ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వంలో ఎవరున్నా సమస్యకు పరిష్కారాన్ని చూపి రైతులకు నీళ్లివ్వాల్పింది పోయి రచ్చ చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా నీళ్లు, పచ్చటి పంట పొలాలు కనిపించేవని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నీటి కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకూ ప్రజల తరఫున పోరాడుతామన్నారు. తనకు మహబూబాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరితో ఆత్మీయ సంబంధం ఉందని, ప్రతి ఒక్కరూ వారి ఇంటి ఆడబిడ్డగా తనను ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ ప్రేమను ఇలాగే కొనసాగించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరోమారు గెలిపించాలని కోరారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్‌కు మళ్లీ ఓటు వేసి తప్పు చేయొద్దని ప్రజలను కోరారు. తాను పిలవగానే మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, జడ్పీ చైర్పర్సన్ బిందు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వద్దిరాజు కిషన్‌రావు, భరత్‌కుమార్‌రెడ్డి, బానోత్ రవికుమార్, శ్రీనివాస్‌రెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి, ముత్యం వెంకన్నగౌడ్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మహబూబ్‌పాషా, మండలాల అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు పాల్గొన్నారు.