సుబేదారి, నవంబర్7 : హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరణకు గురైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాసరి సురేందర్ ఆలియాస్ సూరి అలియాస్ మొయిన్ అలియాస్ మునీర్‌తోపాటు గ్యాంగ్‌ను వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా అసాంఘిక కార్యకలాపాలపై ‘గ్రేటర్లో క్రిమినల్స్’.. వరంగల్‌కు మోస్ట్ వాంటెడ్ సూరి’ కథనంతో ఈ నెల 1న ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను శుక్రవారం వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ వెల్లడించారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారానికి చెందిన దాసరి సురేందర్ హైదరాబాద్‌లో సుపారీపై భార్యను, బావమరిదిని హత్య చేశాడు.
అలాగే దోపిడీలు, దొంగతనాలు చేశాడు. ఇతడిపై మొత్తం 46 కేసులు, మూడు పీడీ యాక్ట్‌లు నమోదయ్యాయి. సురేందర్‌ను హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్ అక్కడ నగర బహిష్కరణ చేశారు. అప్పటి నుంచి సురేందర్ బీమారంలో మకాం వేసి ములుగుకు చెందిన సామ్రాజ్ శ్రీచక్రి, క్రాంతి, ఏనుగుల నితిన్, కోమటిపల్లికి చెందిన నమిండ్ల శివమణి, డెలివరీ బాయ్ రాహుల్, డాగ్ఫాం నిర్వాహకుడు శివవైభవ్, గచ్చిబౌలికి చెందిన అదిత్యఠాకూర్తో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.
వీరంతా గంజాయి సేవించేవారు. భూపాలపల్లిలో హత్యకు గురైన సురేందర్‌కు బాసిత్ ఫాలోవర్. బాసిత్‌ను హత్య చేసిన నిందితులను పిస్టల్‌తో చంపడానికి ఆయన బావ షారుక్‌ఖాన్ అనుచరుడు బబ్లూతో సురేందర్ డీల్ కుదుర్చుకున్నాడు. ఈనెల 18న తన ఏడుగురు ముఠాతో రెండు బైక్‌లపై శాయంపేట పోలీసు స్టేషన్ పరిధిలోని మాందారిపేట వద్ద లారీని ఆపి డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించాడు. బంకులో పెట్రోల్ పోయించుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లారు. బాధితుడు లారీ డ్రైవర్ కొమిరి రజినీకాంత్ ఫిర్యాదు మేరకు శాయంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శుక్రవారం శాయంపేట ఎస్సై పరమేశ్వర్ కొత్తగట్టు క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సురేందర్‌తోపాటు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు పిస్టల్స్, ఒక బుల్లెట్, రెండు బైక్‌లు, కత్తి, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. సమావేశంలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఏ మధుసూదన్, పరకాల ఇన్చార్జి ఏసీపీ వెంకటేశ్, శాయంపేట ఇన్స్పెక్టర్ రంజిత్‌రావు, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బాబులాల్, శాయంపేట ఎస్సై పరమేశ్వర్ పాల్గొన్నారు.