ఖిలావరంగల్, మార్చి 02: శివనగర్‌లో కోతుల(Monkeys) బెడద రోజు రోజుకు తీవ్రమవుతోంది. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, మహిళలు, వృద్ధులు రోడ్లపై వెళ్లాంలంటే కోతులు ఎటు నుంచి దాడి చేస్తాయో తెలియక బెంబేలెత్తున్నారు. పొరపాటున ఇంటి తలుపుతు తెరిస్తే అంతే సంగతులు ఇళ్లలోకి చొరబడి బియ్యం, పప్పులు, ఇతర ఆహార పదార్థాలను చెల్లాచెదరు చేస్తున్నాయి. అడ్డు వచ్చిన వారిపై దాడి చేసి గాయాలు చేస్తున్నాయి. దీంతో శివనగర్ వాసులు భయాందోళనలు చెందుతున్నారు. పది రోజుల్లో ముగ్గురిపై దాడిచేసిన (Monkeys attack)కోతులను బందీంచేందుకు బల్దియా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం శివనగర్‌కు చెందిన బత్తుల సత్యం ఇంటి ముందకు కోతుల గుంపు వచ్చింది. భయంతో ఇంటిలోకి వెళుతుండగా ఒక్కసారిగా దాడి చేయగా భయంతో పరిగెత్తుతూ కిందపడడంతో కాళ్లకు, చేతులకు గాయాలు కాగా స్థానికులు దవాఖానకు తరలించారు. ఇటీవల పారిశుద్ధ కార్మికురాలు గన్నారపు తేజమ్మ, పోలెపాక రాజు కోతులు దాడిలో గాయపడ్డారు. తాజాగా సత్యంపై కోతుల దాడి జరగడంతో శివనగర్‌లో ప్రజలు బయటకు వెళ్లాంలంటే జంకుతున్నారు. బల్దియా అధికారులు స్పందించి శివనగర్‌లో బోనులు ఏర్పాటు చేసి కోతులను బందించి అటవీ ప్రాంతాలకు తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటా శివనగర్ ప్రజలంతా బల్దియా ఎదుట ధర్నా చేస్తామని స్థానికులు హెచ్చరించారు.