పంట రుణం మాఫీ చేశామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనకు, వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడంలేదు. మొదటి మూడు దశల్లో వివిధ కారణాలతో రుణాలు మాఫీ కాని వారికి నాలుగో దశలో చేసినట్లు కాంగ్రెస్ సర్కారు నవంబరు 30న ప్రకటించింది. బ్యాంకు బ్రాంచీల వారీగా జాబితాలను అనధికారికంగా విడుదల చేసింది. పంట రుణాలు మాఫీ అయినట్లు, ఈ ప్రక్రియ పూర్తయినట్లు పదేపదే చెప్పుకుంటున్నది. అయితే నాలుగో దశ మాఫీ ప్రకటించి నెల రోజులైనా ఏ ఒక్క రైతు ఖాతాలోనూ ఇప్పటికీ డబ్బులు జమచేయలేదు. దీంతో ఆందోళన చెందుతున్న రైతులు ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లి మాఫీపై వాకబు చేస్తున్నారు. అకౌంట్లలో డబ్బు లు పడితేనే మాఫీ అయినట్లని, లేకపోతే కానట్లేనని బ్యాంకర్లు చెబుతుండడంతో అన్నదాతలు భయపడుతున్నారు. ఊరిలోని ఇతర రైతుల రుణాల పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. నాలుగో దశలోనూ రైతులందరి పరిస్థితి ఒకేలా ఉండడంతో ఏం చేయాలో తెలియక, ఎవరిని అడగాలో అర్థంకాక ఇబ్బందులు పడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలిచ్చింది. రైతులకు రూ.2 లక్షల లోపున్న పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిబంధనల పేరుతో రైతులకు అన్యాయం చేసింది. సగం మంది రైతులకు సైతం మాఫీ చేయలేదు. జూలైలో మాఫీ ప్రక్రియ మొదలు పెట్టి ఆ నెలాఖరులోనే రెండో, ఆగస్టులో మూడో దశలో రుణమాఫీ చేసినట్లు ప్రకటించింది. రేషన్‌కార్డు, కుటుంబం నిబంధనలు పెట్టి సగం మందికి మాఫీ వర్తించకుండా చేసింది. కుటుంబ సభ్యులందరి రుణం రూ.2 లక్షల కంటే ఎక్కువున్నా మాఫీ చేయలేదు. మొత్తంగా మొదటి మూడు దశల్లో పలు కొర్రీలతో సగం మందికిపైగా రైతులకు మాఫీ అమలు కాకుండా చేసింది.
ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఎమ్మెల్యేలను నిలదీశారు. దీంతో మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ అర్హుల గుర్తింపునకు సర్వే చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారణం చూపి రెండు నెలలు సాగదీసింది. రేషన్ కార్డు లేని కుటుంబ సభ్యులు మండల వ్యవసాయ అధికారి వద్దకు వచ్చి ఫొటో దిగాలని నిబంధన పెట్టింది. ఇవన్నీ చేసినా అర్హులందరికీ రుణ మాఫీ ఎప్పుడనేది చెప్పకుండా తాత్సారం చేసింది. రైతుల ఉద్యమాలతో నాలుగో దశ మాఫీ ప్రక్రియను మొదలుపెట్టినట్లు నవంబర్ 30న ప్రకటించింది. ఇదే చివరి దశ అని, మాఫీ ప్రక్రియ పూర్తయినట్లు చెప్పింది. అయితే అర్హుల జాబితాలోని ఏ ఒక్క రైతు ఖాతాలోనూ ఇప్పటికీ పైసలు జమ చేయలేదు. మూడు దశల తర్వాత ఎవరికీ పంట రుణం మాఫీ కాలేదు.
పంట రుణాలకు సంబంధించి బ్యాంకుల నిబంధనలు ప్రత్యేకంగా ఉంటాయి. లో ను తీసుకున్న ఏడాదిలోపు చెల్లిస్తే మిత్తి తక్కువగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రాయితీ వర్తిస్తుంది. ఏడాదిలోపు పంట రుణం, మిత్తి చెల్లిస్తే వారం రోజుల్లోనే మళ్లీ లోను ఇస్తుంటాయి. బ్యాంకుల్లో మిత్తి తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది రైతులు లో ను తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు. రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాల మాఫీ ప్రక్రియను సాగదీస్తుండడంతో రైతులపై ఆర్థికంగా భారం పడుతున్నది. రుణ మాఫీ పైసలు బ్యాంకుల్లో జమవుతాయనే ఆశతో రైతులు నెల రోజులుగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ వైఖరితో ఈ నెలలోనే ఏడాది గడువు ముగుస్తున్నా అసలు, మిత్తి చెల్లించకుండా వాయిదా వేస్తున్నారు. దీంతో లక్ష రూపాయల లోనుపై కనీసం రూ.5 వేల వరకు అదనంగా మిత్తి అవుతున్నది. దీనికి తోడు కొత్త రుణం కోసం బ్యాంకుకు వెళ్లినప్పుడు సాంకేతిక సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.