హనుమకొండ, నవంబర్ 14 : హనుమకొండ జిల్లా గ్రంథాలయంలో పాఠకులకు, ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు, అన్ని రకాల వసతులు, పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు, ఆన్ డిమాండ్ బుక్స్, ఉచిత వైఫై, కంప్యూటర్ సెక్షన్, ఐదు రూపాయల భోజనం వంటి సౌకర్యాలను కల్పించినట్లు గ్రంథాలయ ఛైర్మన్ మహ్మద్ అజిజ్ఖాన్ తెలిపారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు హనుమకొండ జిల్లా గ్రంథాలయంలో ఘనంగా ప్రారంభించారు.
అనంతరం అజిజ్ఖాన్ మాట్లాడుతూ 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవం జవహర్లాల్ నెహ్రు జయంతి సందర్భంగా బాలల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని, ఎస్.ఆర్ రంగనాథన్ భారతదేశంలోని గ్రంథాలయాలకు వారు చేసిన కృషిని గ్రంథపాఠకులకు వివరించారు. ఉత్తర తెలంగాణలో హనుమకొండ జిల్లా గ్రంథాలయంలో త్వరలో మహిళలకు రీడింగ్ హాల్, ఆడిటోరియం, దివ్యాంగులకు ప్రత్యేక సెక్షన్ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.శశిజాదేవి, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, నెక్కొండ కవిత-కిషన్, మానస-రాంప్రసాద్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ బిన్ని లక్ష్మణ్, హనుమకొండ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొమ్మతి విక్రమ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కందుల సృజన్కాంత్, గ్రంథాలయ సిబ్బంది గ్రేడ్-2 లైబ్రరీయన్ సీహెచ్.మల్సూర్, గ్రేడ్ -3 లైబ్రరీయన్ పురుషోత్తం రాజు, జూనియర్ అసిస్టెంట్ సంతోష్‌కుమార్, రికార్డు అసిస్టెంట్ మమత, ఇంటర్నెట్ సెక్షన్ నిర్వాహకుడు రాజేష్, గ్రంథాలయ సిబ్బంది, గ్రంథాలయ పాఠకులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.