హనుమకొండ చౌరస్తా, నవంబర్ 9 : వరంగల్ నిట్ క్యాంపస్ కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది. టెక్నోజియాన్లో సరికొత్త ఇన్నోవేషన్స్ ఆవిష్కృతమవుతున్నాయి. దేశంలోని వివిధ ఇంజినీరింగ్ కాలేజీల నుంచి సుమారు 7వేల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 50కిపైగా ఈవెంట్లను ప్రదర్శించారు. క్రియేటివ్ రోబోటిక్స్ స్కిల్షాప్ నుంచి చిన్నారులు రుద్రాక్షిత ఏటీఎం మిషన్ రూపొందించగా చెరువులను శుద్ధిచేసే పరికరాన్ని గొల్లపల్లి మన్విత రూపొందించింది. నిట్ విద్యార్థులు కొండలు, పర్వతాలు ఎక్కే సరికొత్త బైక్ను రూపొందించారు. 25 మంది విద్యార్థులు 6-7 నెలలు కష్టపడి రూ.4లక్షల వ్యయంతో ఫార్ములా కార్ తయారు చేసి అబ్బురపరిచారు. ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో చదివితే సాధించలేనిది ఏమీలేదని మోటివేషన్ స్పీకర్, ఫౌండర్ మ్యాథ్స్ సేర్ డాక్టర్ గజేంద్ర పురోహిత్ అన్నారు.
‘భవిష్యత్తును ఉద్దేశ్యంతో నడిపించండి’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ‘నమస్తే వరంగల్’ అందరూ బాగున్నారా అంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ తనూజైన్ విద్యార్థులను ఉత్సాహపరిచారు. అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల్లో స్ఫూర్తినింపారు. కాగా, టెక్నోజియాన్లో విద్యార్థులు సరికొత్త పరికరాలను రూపొందించారు. ఆడవారికి వచ్చే పీరియడ్స్ నొప్పులు మగవారికి వస్తే ఎలా భరిస్తారనే ఆలోచనతో ఫీల్ ది పెయిన్ అనే పరికరాన్ని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించారు. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్-డీఎన్ఏ, వేలిముద్ర, ఇతర ఫోరెన్సిక్ సాంకేతికతలపై వర్షాప్ నిర్వహించారు. క్యాంపస్ స్టేడియంలో రోబోటిక్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రోన్ల వేగం అందరినీ అబ్బురపరిచింది.