నమస్తే నెట్వర్క్, జూన్ 24 : ఉమ్మడి జిల్లాలో మంగళవారం అక్కడక్కడా మోస్తరు వర్షం కురిసింది. హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల్లో ఓ మోస్తరు వాన పడింది. భూపాలపల్లి జిల్లాలో చిరు జల్లులు కురిశాయి. మంగళవారం కురిసిన వర్షం పత్తి చేన్లకు కొంత ఊపిరినివ్వగా, వరి నాట్లు వేసే రైతులు మాత్రం భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.
మే నెల చివరి వారంలో నే నైరుతి రుతుపవనాల పేరిట వర్షాలు దంచి కొట్టాయి. దీనికి తోడు వాతావరణ శాఖ సైతం రుతుపవనాల రాక ముందస్తుగా వచ్చిందని, ఈసారి రైతులకు పండుగేనని ప్రకటించింది. దీంతో ఉబ్బితబ్బిబ్బయిన రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులతో నారుమడులు పోసుకున్నారు. దీనికి తోడు ముందస్తుగానే దుక్కులు చేసుకొని పత్తి పంట వేసుకున్నారు.
అయితే ముందుగా మురిపించిన వానలు తీరా కనుమరుగయ్యాయి. మే చివరి వారంలో కురిసిన వర్షా లు జూన్ చివరి దశకు చేరినప్పటికి పడలేదు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కురిసిన కొద్ది వానకు పత్తితోపాటు చిరుధాన్యాలైన కంది, పెసర, మక్కజొన్న పంటలు కూడా విత్తారు.
20 రోజులుగా చినుకు లేకపోవడంతో పాటు ఎండలు తీవ్రంగా ఉండడంతో భూమిలో విత్తిన విత్తనాలు, మొక్కలు ఎండిపోతున్నాయి. ఎండలు దంచి కొడుతుండడంతో దుక్కి తడారిపోతు న్నాయని, 15 రోజులుగా ఒక్కసారి కూడా వర్షం కురవలేదని అన్నదాత వాపోతున్నాడు. ఒకటీరెండు రోజుల్లో ఆశించిన వానలు కురవకపోతే నష్టపోతామంటున్నారు. కొందరు రైతులు పత్తి విత్తనాలు ఎండకు ఎండిపోకుండా నీరుపోస్తూ కాపాడుకుంటున్నారు.