నెల్లికుదురు, జనవరి 24: ప్రజాపాలనలో మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకొమ్మని చెప్పడానికి నిర్వహించే గ్రామసభలు పనికిరానివని, అర్హులకు మొండిచేయి చూపిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. నర్సింహులగూడెంలో జరిగిన గ్రామసభలో ఎమ్మెల్సీ పాల్గొనగా, 525 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, గ్రామంలో 1800 ఎకరాలకు రైతు భరోసా అర్హులని, 66 ఎకరాలకు అనర్హులని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా తక్కళ్లపల్లి మాట్లాడుతూ ఇల్లు లేనివారి పేరు ఈ లిస్టులో లేకపోతే అన్యాయమైపోతారన్నారు. 66 ఎకరాల్లో అర్హత ఉండి కూడా అనర్హులుగా గుర్తించినట్లయితే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు పారదర్శకంగా రేపు అర్హులందరికీ ఈ నాలుగు పథకాలు అందజేయాలని, లేదంటే ప్రభుత్వాన్ని నడిరోడ్డుపై నిలదీ యాలన్నారు. ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తుల జాబితా చదవడానికి గ్రామసభలు అవసరమా?, అధికారులు పార్టీలకతీతంగా అర్హుల జాబితాను సిద్ధం చేసి వారికే పథకాలు ఇవ్వాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
వీళ్లు అర్హులు అని తీర్మానం చేయకుండా కేవలం దరఖాస్తు చేసుకున్నోళ్ల పేర్లు చదివి అధికారులు వెళ్లిపోతున్నారని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఫాల్స్, టైంపాస్, డైవర్షన్ సభలు నిర్వహిస్తున్నదన్నారు. అదేవిధంగా సీతారాంపురంలో జరిగిన గ్రామసభలో రేకులతండాకు చెందిన ప్రజలు పైసలిచ్చిన వాళ్ల పేర్లు జాబితాలో పెడుతావా.. ఏమీలేని మా తండావాళ్లను విస్మరిస్తావా అంటూ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.