మహబూబాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 70వేల మంది అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. గురువారం శాసనమండలిలో ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో అంగన్వాడీల వేతనం రూ.4200 మాత్రమే ఉండేదని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రూ.7వేలు, రూ.10,500, రూ.13,650 వరకు పెంచినట్లు తెలిపారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు నుంచి ఏడు లక్షల మంది చిన్న పిల్లల చదువు కోసం కేంద్రాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మినీ అంగన్వాడీను తీసివేసిందన్నారు. అలాగే సెంటర్ల అద్దె, కూరగాయలు, గ్యాస్ తదితర నిత్యావసర సరుకులకు సంబంధించిన బిల్లులు నెలల తరబడి చెల్లించడం లేదన్నారు. అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలకు కూడా మూడు, నాలుగు నెలలకోసారి ఇవ్వడం వల్ల ఆ భారం పిల్లలపైనా పడి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
సూపర్వైజర్ పోస్టుల కోసం రాత పరీక్ష లేకుండా సీనియార్టీ ప్రకారం నియమించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రూ.18వేల నుంచి రూ.26వేలకు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పటికీ అమలుచేయలేదని గుర్తుచేశారు. అంగన్వాడీల రిటైర్మెంట్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చినా అమల్లోకి రాలేదన్నారు. అంగన్వాడీ కేంద్రాల ఇంటి అద్దె, నిత్యావసర సరుకులతో పాటు వేతనాలను ప్రభుత్వం ప్రతి నెలా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ రవీందర్రావు ప్రశ్నలకు మంత్రి సీతక సమాధానమిస్తూ అంగన్వాడీల సమస్యలన్నింటినీ త్వరలో పరిషరిస్తామని హామీ ఇచ్చారు.