అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్ అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని ఎస్ ఎస్వీ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ 7, 9, 10 డివిజన్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోందని మండిపడ్డారు. ప్రధాని మోదీకి దమ్ముంటే పార్లమెంట్‌కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే బీజేపీ నాయకులు కాలనీల్లోకి వస్తున్నారని పేర్కొన్నారు. దగాకోరు, మభ్యపెట్టే నాయకులను తరిమికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో డివిజన్లలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 21 : దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్‌గా నిలుస్తోందని, ఏ రాష్ట్రంలో లేని ఎక్కడాలేని విధం గా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ 7, 9, 10వ డివిజన్ల ఆత్మీయ సమ్మేళనం హనుమకొండలోని ఎస్ఎస్వీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా చీఫ్‌విప్ దా స్యం వినయ్‌భాసర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ ఈ ఆత్మీ య సమ్మేళనానికి వచ్చిన వారందరూ దా స్యం వినయ్‌భాసర్ కుటుంబ సభ్యులే అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల గురిం చి వివరించేందుకే ఆత్మీయ సమ్మేళనం ఏర్పా టు చేసుకున్నట్లు తెలిపారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది జనం మధ్యలో ఉంటున్న నాయకుడు దాస్యం వినయ్‌భాసర్ అని కొనియాడారు.
కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటూ విషం కక్కుతోందని విమర్శించారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ కా ర్యకర్తలు, ప్రజలందరూ కూడా సమన్వయం తో పనిచేయాలని కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో కంటికి కనిపిస్తోందని, అందుకు వినయ్ భాసర్ను అభినందిస్తున్నానని అన్నారు. ఒక్కో డివిజన్లో రూ.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరిగాయని తెలి పారు. 7, 9, 10 డివిజన్లలో సుమారు రూ.75 కోట్లతో వసతులు కల్పించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడాలేనివిధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, అంబేద్కర్ చిన్న రాష్ర్టాల ఏర్పాటు గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో పొందుపరిచినట్లు గుర్తుచేశారు. ఆ మహనీయుడి విగ్రహం ఏర్పాటు చేసి తెలంగాణ సెక్రటేరియట్‌కు అంబేదర్ పేరు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని అన్నారు. దమ్ముంటే ప్రధాని మోదీ నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేదర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులకు దళితబంధు కూడా అమలు చేస్తున్నామని, దళితవాడల్లోకి కాంగ్రెస్, బీజేపీ నాయకులు వస్తే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని, మూడోసారి సీఎంగా కేసీఆర్‌ను చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దాస్యం వినయ్భాసర్ను ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
బీజేపీ నాయకులను నిలదీయాలి : ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
కులాలు, మతాల మధ్య విద్వేషాలు సృష్టించే బీజేపీ నాయకులను ఎక్కడికక్కడే నిలదీయాలని, దగాకోరు, మభ్యపెట్టే పార్టీల నాయకులను తరిమికొట్టాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గంలో 7,9,10 డివిజన్లో ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలను గడపగడపకూ అందించామన్నారు. రాష్ట్రసాధన కోసం తాను రాస్తారోకో, రైల్‌రోకో చేసినట్లు గుర్తుచేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తనను ఆశీర్వదించి గెలిపించారని, పశ్చిమ నియోజకవర్గంలో ఇలాంటి అభివృద్ధి జరగడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. గతంలో అకాల వర్షం కారణంగా వరంగల్ నగరంలో వరదలతో మునిగిపోయిన సందర్భాల్లో ఏ పార్టీ కూడా ముందుకురాలేదని, ఎవరు కూడా స్పందించలేదని, అలాంటి సమయంలో బీఆర్ఎస్ నాయకులు కలిసి ప్రజలను ఆదుకున్నారని చెప్పారు.
రూ.22 కోట్లతో 7వ డివిజన్లో, రూ.21 కోట్లతో 9వ డివిజన్, రూ.26 కోట్లతో 10వ డివిజన్లో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. ఒకప్పుడు పార్కు అంటే పబ్లిక్‌గార్డెన్ ఒకటే ఉండేదని, ఇప్పుడు కాలనీల్లో ఎక్కడా చూసిన పార్కులు దర్శనమిస్తున్నాయన్నారు. కాజీపేట దర్గాలో పీఠాధిపతి ఖుస్రూపాషా చొరవతో మైనార్టీల కోసం ఖాన కూడా ఏర్పాటు చేసుకున్నామన్నారు. అనంతరం 7,9,10 డివిజన్ల లబ్ధిదారులకు రూ.34,03,944 విలువగల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెకులను అందించారు. ఈ సందర్భంగా 10వ డివిజన్‌కు చెందిన పలువురు బీజేపీ మహిళా నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి కడియం శ్రీహరి, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్‌సింగ్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, చీకటి శారదాఆనంద్, డివిజన్ అధ్యక్షులు కొండా శ్రీనివాస్, ఎండీ ఖలీల్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
దుబాయ్‌లో చిక్కుకొంటే తీసుకొచ్చారు..
దుబాయ్‌లో చిక్కుకొన్న నన్ను వినయ్‌భాస్కర్ చొరవతో మళ్లీ ఇక్కడకు తీసుకొచ్చారు. నాకు ఇటీవల పక్షవాతం వచ్చింది. దాస్యం వినయన్న కాపాడారు. కార్యకర్తలు, ప్రజలకు అండగా ఉంటూ అభిమానం చాటుకుంటున్నారు. కులమతాలకతీతంగా అందరినీ ఆదుకుంటున్నారు. భద్రకాళి ట్యాంకుబండ్‌ను అందంగా తీర్చిదిద్దారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఐదోసారి వినయ్‌భాస్కర్‌ను గెలిపిద్దాం.
– ఫసియొద్దీన్, 9వ డివిజన్