నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి28(నమస్తే తెలంగాణ) : అత్యంత ఉత్కంఠత రేకెత్తిస్తున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి అంచనాలు గెలుపోటములపైకి మళ్లాయి. పోలింగ్ సరళిని విశ్లేషిస్తూ ప్రధా న అభ్యర్థులంతా శుక్రవారం జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించారు. నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం తెల్లారుజామున వెల్లడైన వివరాల ప్రకారం.. తుది పోలింగ్ 93.57 శాతంగా నమో దైంది.
ఈ నెల 3వ తేదీన కౌంటింగ్ జరుగనుంది. సోమవా రం మధ్యాహ్నం వరకే ఫలితాల సరళి వెల్లడికానుంది. పోలింగ్ నాటి సరళిని పరిశీలిస్తే ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజేత తేలకపోవచ్చని, ద్వి తీయ ప్రాధాన్యత ఓట్ల లె క్కింపు తప్పనిసరి కానుందని తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో ప్రధాన అభ్యర్థులు గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ఎలిమినేషన్ రౌండ్స్ వరకు వస్తే గానీ విజేత తేలకపోవచ్చన్న అంచనాలు లేకపోలేదు.
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూలేని విధంగా ఈ సారి టఫ్ ఫైట్ నెలకొన్నట్లుగా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. 2013, 2019 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ద్విముఖ పోరు కొనసాగగా ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా బహుముఖ పోటీ తెరపైకి వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ, యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూటీఎస్ అభ్యర్ధి పింగిళి శ్రీపాల్ రెడ్డిల మధ్యే ప్రధాన పోటీ నెలకొని ఉంటుందన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
టీచర్స్ జాక్ అభ్యర్థిగా రంగంలో నిలిచిన మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ సైతం బలమైన బీసీవాదంతో పాటు గతంలో పీఆర్టీయూలో కీలక నేతగా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం, నియోజకవర్గ వ్యా ప్తంగా ఓటర్లకు సుపరిచితం లాంటి అంశాలన్నీ తన విజయానికి దోహదం చేస్తాయన్న అంచనాలో ఉన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి, పీఆర్టీయూ మాజీ నేత గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి కూడా తనదే విజయమని భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తంరెడ్డి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన జాతీయవాదం, బీజేపీ మద్దతు, ఉపాధ్యాయ మాజీ నేతగా అనుభవం తదితర అంశాలతో గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పోలింగ్ సరళిని బట్టి తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలదన్నది స్పష్టమవుతున్నది. ఈ నేపథ్యంలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్నాయి. ప్రలోభాల పర్వం ప్రభావం ఓటర్లపై ఎక్కువగా ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ ఫలితం తేలక ఎలిమినేషన్ రౌండ్స్‌కు కౌంటింగ్ దారి తీయవచ్చన్న అంచనాలు లేకపోలేదు.
గురువారం సాయంత్రం 4 గంటల తర్వాత వెల్లడించిన ఓటింగ్‌కు, నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం తెల్లారుజామున వెల్లడైన పోలింగ్ శాతంలో స్వల్ప పెరుగుదల కనిపించింది. తుది పోలింగ్ 93.57 శాతం గా నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 25,797 మంది ఓటర్లుండగా, 24,139 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 12 జిల్లాల పరిధిలో నియోజకవర్గం విస్తరించి ఉండగా సిద్దిపేటలో 93.98 శాతం, జనగామలో 94.31శాతం, హన్మకొండలో 91.66 శాతం, వరంగల్‌లో 94.09 శాతం, మహబూబాబాద్‌లో 94.47శాతం, భూపాలపల్లిలో 94.22 శాతం, ములుగులో 92.83 శాతం, భద్రాద్రి కొత్తగూడెంలో 91.94 శాతం, ఖమ్మంలో 93.05 శాతం, యాదాద్రిలో 96.54 శాతం, సూర్యాపేటలో 94.97 శాతం, నల్లగొండలో 94.75 శాతం నమోదైంది. కాగా గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి 3.16 శాతం పోలింగ్ పెరిగింది.