జనగామ చౌరస్తా, మే 27 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఘన విజయం సాధిస్తారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సోమవారం జనగామ జిల్లాకేంద్రంలోని ప్రెస్టన్ స్కూల్ పోలింగ్ బూత్‌లో పల్లా, గిర్నిగడ్డ ఏబీవీ హైస్కూల్ లో ఆయన సతీమణి నీలిమ ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిరుద్యోగులు,
పట్టభద్రులు విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారెంటీలు అమలుకు నోచుకోలేదని ఆయన విమర్శించారు. నిరుద్యోగ భృతి, 2లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు, మెగా డీఎస్సీపై హామీలిచ్చి నెరవేర్చలేదన్నారు. క్లీన్ ఇమేజ్ ఉన్న రాకేశ్‌రెడ్డిని పట్టభద్రులంతా కలిసి భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటివరకు నాలుగుసార్లు ఘన విజయం సాధించగా పట్టభద్రులు, నిరుద్యోగులు, మేధావుల మద్దతుతో ఐదోసారి గెలువడం ఖాయమైందని పేర్కొన్నారు.