HomeWarangal-ruralMlc Brs Mla Candidate Kadiam Srihari Meeting With Activists In Mallakpally And Dharmapuram Villages
కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కులేదు
కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాల్లో నిజాయితీ లేదని, ఆ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని మల్లక్పల్లె, ధర్మపురం గ్రామాల్లో గురువారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
వారి హామీల్లో నిజాయితీ లేదు
ఎన్నికల కోసమే మోసపూరిత వాగ్దానాలు
తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష
గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి
మల్లక్‌పల్లి, ధర్మాపురం గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశం
ధర్మసాగర్, అక్టొబర్ 12 : కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాల్లో నిజాయితీ లేదని, ఆ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని మల్లక్పల్లె, ధర్మపురం గ్రామాల్లో గురువారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కడియం శ్రీహరి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల్లో నిజాయితీ లేదన్నారు. ఉంటే పక్కన కర్ణాటక రాష్ట్రంలో అవి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అక్కడ అమలు చేయలేని పథకాలను ఇక్కడ మాత్రం ఓట్ల కోసం మేము ఇస్తామని హామీలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కర్ణాటకలో పింఛన్లు రూ.1200 మాత్రమే ఇస్తున్నారన్నారు. కానీ, మన రాష్ట్రంలో రూ. 2 వేలు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి, అక్రమాలు, స్కామ్‌లు, దోచుకోవడం, దాచుకోవడం అని అన్నారు.
ఇక బీజేపీకి పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తొమ్మిదేళ్లలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమం కోసం నిబద్దతతో పని చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం చిన్నది అయిన పెద్ద మనసుతో సీఎం కేసీఆర్ పని చేస్తూ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రజలందరూ సమష్టిగా పని చేసి రానున్న ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని కోరారు. తనకు ఎమ్మెల్యే రాజయ్యకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. త్వరలోనే జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఇద్దరం ఎన్నికల ప్రచారం చేస్తామని తెలిపారు. తనకు వ్యక్తిగత ఎజెండా లేదని, నియోజకవర్గం అభివృద్దే ఎజెండా అని అన్నారు.
నన్ను నమ్మకున్న ప్రజలకు న్యాయం చేస్తానన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకు దీటుగా స్టేషన్ఘన్పూర్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఈ నియోజవర్గంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజల ముందు కండ్లకు కనిపిస్తున్నాయని గుర్తు చేశారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, మీ ఆత్మగౌరవం పెంపొందించేలా పని చేశానన్నారు. నియోజకవర్గ ప్రజలు తనకు రాజకీయ జన్మనిచ్చారన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని, నిండు మనసుతో తనను ఆశీర్వాదించాలని కోరారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ జీ రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, మల్లక్పల్లె సర్పంచ్ మునిగెల రాజు ముదిరాజ్, జడ్పీటీసీ డాక్టర్ పిట్టల శ్రీలత, ధర్మపురం సర్పంచ్ మునిగాల యాకోబ్, ఎంపీటీసీ భీంరెడ్డి కరుణాకర్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ కరంచంద్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాదకుమార్, మాజీ సర్పంచ్ రమేశ్, బీఆర్ఎస్ నాయకులు అశోక్, బాలస్వామి, కరుణాకర్ రెడ్డి, పిట్టల సత్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.