ఉమ్మడి జిల్లా అంతటా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక పూర్తయి ప్రొసీడింగ్స్ ఇచ్చి, ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజలు చేస్తుంటే మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎదురుచూపులు తప్పడం లేదు. మంజూరు ప్రక్రియ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో ఇళ్ల కోసం ఎంతో ఆశగా దరఖాస్తు చేసుకున్న వేలాది మంది పేద ప్రజలకు నిరాశే మిగులుతోంది. అయితే మంత్రి సమయం ఇవ్వకపోవడం వల్లే ప్రొసీడింగ్స్ పంపిణీ ఆలస్యమవుతున్నదని తెలుస్తుండగా ఇంటి పనులు ప్రారంభించేందుకు శుభ ముహూర్తాలు ముగుస్తుండడంతో ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
– వరంగల్, జూన్ 10
వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం సుమారు 20వేలకు మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. అందులో సుమారు 10 నుంచి 15వేల దరఖాస్తులు తూర్పు నియోజకవర్గం నుంచే వచ్చాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక, ప్రొసీడింగ్ల పంపిణీ వారం రోజుల క్రితమే ప్రారంభం కాగా మంత్రి ఇలాకాలో మాత్రం ఇప్పటివరకు వా టి ఊసేలేదు. జూన్ 2, 6వ తేదీల్లో పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు రెండు సార్లు తేదీలు ప్రకటించినా మంత్రి సురేఖ సమయం ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. గ్రేటర్ పరిధిలోని వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు తమ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయడమే కాకుండా ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజలు చేస్తున్నారు. తూర్పులో మాత్రం మంత్రి కొండా సురేఖ సమయం ఇవ్వకపోవడమే ప్రొసీడింగ్ల పంపిణీ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.
ఎదురుచూపులు ఎన్ని రోజులో..
తూర్పులో వచ్చిన దరఖాస్తుల నుంచి ఇందిరమ్మ కమిటీలు 4,200 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ కమిటీలు పంపిన జాబితాను అధికారు లు క్షేత్రస్థాయిలో పరిశీలించి 3,100 మందిని అర్హులుగా ఫైనల్ చేశారు. అందులో 1,659 లబ్ధిదారుల ప్రొసీడింగ్లను సిద్ధం చేశారు. మిగతా అర్హులను గుర్తించి జాబితా పంపాలని అధికారులు కమిటీలకు సూచించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారుడికి మంజూరు పత్రాలు అందించలేదు. మంత్రి సమయం ఇచ్చిన వెంటనే ప్రొసీడింగ్స్ పంపిణీ చేస్తామని అధికారులు చెబుతుండగా.. మరి మంత్రి ఎప్పుడు సమయమిస్తారో వేచిచూడాలి.