ఎల్కతుర్తి, నవంబర్ 9 : అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీఆర్ఎస్తోనే సాధ్యమవుతాయని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని దామెర, చింతలపల్లి, ఇందిరానగర్, గోపాల్పూర్, బావుపేట, ఆరెపల్లి, గుంటూర్పల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలు, బోనాలు, కోలాట నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ ఎలా ఉందో, ఇప్పుడు సీఎం కేసీఆర్ ఎలా అభివృద్ధి చేశారో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. నాడు కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణ ఇప్పుడు పుష్కలంగా సాగునీరు, ఉచిత కరెంట్, రైతుబంధు పథకాలతో ధాన్యాగారంగా విరజిల్లుతున్నదన్నారు. దేవాదుల నీటితో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామన్నారు. గృహలక్ష్మి, దళితబంధు పథకాలను ప్రతిఒక్కరికీ అందిస్తానని, ఎవరూ అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించి మళ్లీ సీఎం కేసీఆర్ అవుతారన్నారు. రుణమాఫీ, సంక్షేమ పథకాలు ఆపాలని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేయడంతోనే పథకాలు ఆగాయని, ఎన్నికల తర్వాత కొనసాగిస్తామని తెలిపారు.
నియోజకవర్గంలో పరాయి వారు పోటీ చేస్తే ఓట్లు ఎలా వేస్తామని, ఏ పని కావాలన్నా కరీంనగర్‌కు వెళ్లి సమస్యలు చెప్పుకోవాల్సి వస్తుందని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. ఆయా గ్రామాల్లో పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఆత్మగౌరవంతో ఇంటి వారినే గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ఎంపీగా ఏమీ చేయలేని వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తానంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. మళ్లీ ఎమ్మెల్యేగా సతీశ్‌కుమార్‌ను గెలిపించేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని, లక్ష మెజార్టీతో గెలుస్తారని అందులో అనుమానం లేదన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్ మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ 3, బీజేపీ 14 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నాయని, తెలంగాణ కంటే ఆ రాష్ర్టాల్లో అభివృద్ధి, సంక్షేమంలో ముందున్నాయని నిరూపిస్తే జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని, దీనిపై చర్చకు రావాలని సవాల్ చేశారు. బాగు పడుతున్న తెలంగాణను నాశనం చేయడానికే ఆ పార్టీలు చూస్తాయే తప్ప మనపై ప్రేమతో కాదన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రజలు నమ్మడం లేదని, మతతత్వ పార్టీ బీజేపీతో అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కరీంనగర్లో చెల్లని రూపాయి హుస్నాబాద్‌లో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. నియోకవర్గం అభివృద్ధి చెందాలంటే సతీశ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు పాల్గొన్నారు.