ములుగు, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ములుగు ఎమ్మెల్యే సీతక్క అక్రమాలకు పాల్పడుతూ పార్టీ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో లక్షల రూపాయలు తన అనుచరులతో వసూలు చేయిస్తున్నారని జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఆరోపించారు. మంగళవారం ఆయన దళిత బంధులో అవకతవకలపై విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు పార్టీ ఫండ్ పేరుతో దళితుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయం ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి చేరిందని తెలిపారు.
పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించేదిలేదన్నారు. దళారుల సమాచారాన్ని లబ్ధిదారులు తనకు అందజేయాలని సూచించారు. పథకంలో పేరు నమోదు నుంచి మొదలు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చేంత వరకు నగదును అప్పజెప్పే విధంగా దళారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. దళిత బంధు లిస్టులో నమోదైన ప్రతి లబ్ధిదారుడి నుంచి కాంగ్రెస్ నాయకులు రూ.20వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వీటన్నింటిని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి, డబ్బులు వసూలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయించనున్నట్లు జడ్పీచైర్మన్ పేర్కొన్నారు.