కాజీపేట, ఫిబ్రవరి 28 : కొందరు సొంత పార్టీలో ఉండి అభివృద్ధిని అడ్డుకుంటూ, కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నారని, అలాంటి వారిని సహించబోమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Rajender Reddy) మండిపడ్డారు. కాజీపేటలో నిర్మాణంలో ఉన్న ఫాతిమా ఆర్ ఓ బి బ్రిడ్జి పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. జాప్యంపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ నష్టం కలిగించే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, జిల్లా అధ్యక్షుడిగా సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.
ఫాతిమా బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఛత్తీసగగఢ్ నుంచి రావాల్సిన బ్రిడ్జి మెటీరియల్ ఆలస్యం కావడం వల్లనే జాప్యం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే కాజీపేట బ్రిడ్జి అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే కాజీపేట బస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, కేంద్ర రైల్వే శాఖ నుంచి అనుమతులు రాగానే పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. పట్టణంలో పెండింగ్ పనులను వేగం పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు.