ధర్మసాగర్, జూన్ 18 : మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని వాటర్ గ్రిడ్ వద్ద తెలంగాణ నీళ్ల పండుగ నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, జడ్పీ చైర్మన్ మారపెల్లి సుధీర్‌కుమార్ హాజరయ్యారు. ముందుగా మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ప్లాంట్లో నీటిని శుద్ధి చేసే తీరును స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులకు అధికారులు క్లుప్తంగా వివరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడారు. రాష్ట్రంలోని వంద శాతం ఆవాస ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. 1994లో సీఎం కేసీఆర్ ఆనాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో తన నియోజకవర్గం మొత్తానికి శుద్ధిచేసిన తాగునీరు అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తానికి అందిస్తున్నారన్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టే ముందు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులతో పలుమార్లు సుదీర్ఘంగా చర్చించారన్నారు.
తెలంగాణ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చడానికి రూ.43కోట్లతో ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో వేసవిలో తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడినట్లు గుర్తుచేశారు. గ్రామాల్లో రోడ్లపై ఖాళీ బిందెలతో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారన్నారు. నేడు ఏ గ్రామంలో కూడా తాగునీటికి కొరత లేదన్నారు. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే సమయంలో ఎమ్మెల్యేలు కూడా నిరసనలు తెలిపేవారన్నారు. అలాంటి కష్టాలు ఉండకూడదని సీఎం కేసీఆర్ కృష్ణా గోదావరి జలాలలను తాగునీటికి వినియోగిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.
ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాగానే, భూగర్భజలాలు సంవృద్ధిగా పెరిగాయన్నారు. మినరల్ వాటర్‌కు మిషన్ భగీరథ వాటర్ తేడాను ప్రజలకు తెలియాజేస్తూ వారికి మరింత అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులను శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. సమావేశంలో తహసీల్దార్ ఎం రజిని, ఎంపీడీవో జవహర్‌రెడ్డి, జడ్పీటీసీలు పిట్టల శ్రీలత, చాడ సరితారెడ్డి, ఎంపీపీలు మధుమతి, సునీత, మిషన్ భగీరథ ఈఈ రామాంజనేయులు, డీఈ శ్రీనివాస్, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్‌కుమార్, ధర్మసాగర్, ఐనవోలు, హసన్‌పర్తి మండలాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మిషన్‌భగీరథ అధికారులు పాల్గొన్నారు.