‘ప్రధానమంత్రి మోదీవి ఝూటా మాటలు. హైదరాబాద్‌లో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే. రేషన్ బియ్యం పంపిణీపై అడ్డగోలు కథలు చెప్పారు. కావాలంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంపై తెలంగాణ ప్రజలనే అడిగి తెలుసుకో.’ అని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని సోడాషపల్లిలో ఎమ్మెల్యే రాజయ్య అధ్యక్షతన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయంగా రావాల్సిన పన్నుల వాటా తప్పితే రాష్ర్టానికి అదనంగా ఒక్క రూపాయి కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇచ్చిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువుతో అల్లాడుతున్న వేలేరు ప్రాంతంలో సాగునీటి కొరతను తీర్చేందుకు రూ. 104కోట్లతో పనులు ప్రారంభించామన్నారు.
హనుమకొండ సబర్బన్, ఏప్రిల్ 10/ ధర్మసాగర్ /వేలేరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చి పచ్చి అబద్ధాలను ప్రచారం చేసి వెళ్లాడని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం వేలేరు మండలంలోని సోడాషపల్లిలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అధ్యక్షతన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. నియోజకవర్గ ఇన్చార్జి ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇవ్వడం లేదని ప్రధాని అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో 80 కోట్ల రేషన్ కార్డులు ఉండేవని, 2023లోనూ అంతే మొత్తంలో ఉండడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని 55లక్షల కార్డులకు మాత్ర మే కేంద్రం బియ్యం ఇస్తోందని, తెలంగాణ సర్కారు మాత్రం 90 లక్షల కార్డుదారులకు బి య్యం పంపిణీ చేస్తున్నదని వెల్లడించారు. కేంద్రం మనిషికి 5 కిలోల చొప్పున ఒక్కో కిలో మూడు రూపాయల ధరతో ఇస్తుండగా ఇక్కడ మాత్రం మనిషికి 6 కిలోల బియ్యం ఒక్కో కిలో ఒక రూపాయికే ఇస్తున్నామని చెప్పారు.
కేంద్రానికి పన్నుల రూపంలో రాష్ట్రం చెల్లిస్తున్న డబ్బుల్లో 42శాతం తిరిగి ఇస్తారని, తక్కువ పన్నులు చెల్లిం చే బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలకు కూడా అంతే మొత్తంలో నిధులు ఇస్తున్నారని గుర్తు చేశారు. అంతే తప్ప అదనంగా ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పేదలకు ఇస్తున్న రూ.2వేల పింఛన్లో రాష్ట్ర వాటా రూ.1950 అయితే, కేంద్రానివి కేవలం రూ.50 మాత్రమేనని వివరించారు. ఇంకా రోడ్లు, రైల్వే లైన్లు, మెట్రో మార్గాలు కేంద్రమే వేస్తోందంటూ మోదీ చెప్పడాన్ని ఖండించారు. ప్రజలకు వివిధ పథకాలు సక్రమంగా అందేలా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్(డీబీటీ) విధానాన్ని అవలంబిస్తున్నామని ప్రధాని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని, రాష్ట్రంలో ఎప్పటినుంచో 55 లక్షల మందికి రైతుబంధు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి లాంటి పథకాల ద్వారా డీబీటీ విధానంలో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. అత్యంత కరువు ప్రాంతంగా ఉన్న వేలేరుకు 2014 తర్వాత మంచి రోజులు వచ్చాయని, రూ.24కోట్లతో డబుల్ రోడ్డు నిర్మించామన్నారు. సాగునీటి కొరతను తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.104కోట్లు మంజూరు చేశారని, మరి కొద్ది నెలల్లో పనులన్నీ పూర్తి చేసి మండలంలోని చెరువులను నీటితో ళ్ళు నింపుతామని ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్ట్ నీళ్లు కూడా వర్షాకాలంలో అందుబాటులోకి వస్తాయన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు.
కరువు ఉండదు.. చెరువు ఎండదు
నియోజకవర్గంలో భవిష్యత్‌లో కరువు ఉండబోదని, ఒక్క చెరువునూ ఎండిపోనివ్వమని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కూడా బీఆర్ఎస్కే ఓటు వేస్తారన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం వల్ల రాష్ట్రంలో అడవుల శాతం పెరిగిందని, అందుకే 1,700 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. దేవాదుల, గౌరవెల్లి ప్రాజెక్ట్ నీళ్లతో మండలంలో సమృద్ధిగా పంటలు పండుతాయన్నారు. ఈ నియోజకవర్గం నాయకులను తయా రు చేసే ఫ్యాక్టరీ అని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం పంపించిన వరాల మూ టను ఇప్పుతానని వెల్లడించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరితారెడ్డి, చిల్పూరు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు మరిజె నర్సింహారావు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు కీర్తి వెంకటేశ్వర్లు, బిల్లా యాదగిరి, మనోజ్‌రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ వీరన్న, కో ఆప్షన్ సభ్యుడు జానీ, సర్పంచ్‌లు గోదల రాజిరెడ్డి, కొట్టె రాజేశ్, మార్క మల్లి క, మ్యాక రవీందర్, ఎంపీటీసీలు బాలె వెంకటేశ్వర్లు, యూత్ అధ్యక్షుడు గోవింద సురేశ్, ఇట్టబోయిన సంపత్, గ్రామ అధ్యక్షులు పాల్గొన్నారు.
కేసీఆర్ నేతృత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు..
– నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతున్నదని, దేశ ప్రజలు కేసీఆర్ నేతృత్వాన్ని కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్చార్జి ఎంసీ కోటిరెడ్డి అన్నారు. తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే రాజయ్యను రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గతంలో ఎకరాకు రూ.5నుంచి 10లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.కోటి దాటిపోయిందని ప్రజలే చెప్పడం ఇక్కడ జరిగిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. నియోజకవర్గంలో రోడ్లు అద్దంలా మెరిసిపోతున్నాయని చెప్పారు.
బీజేపీ పైసా పని చేయలే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైసా పని చేయలేదు. ప్రపంచంలో ఎక్కడా కంటి వెలుగు లాంటి కార్యక్రమం లేదు. ఐక్యరాజ్యసమితి సైతం రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను ప్రశంసించింది. ఇప్పటికే ప్రారంభించిన వందే భారత్ రైలును ప్రధాని ఎన్నిసార్లు ప్రారంభిస్తాడో ఆయనే తెలవాలె. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
– జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్
మంచి పనులు చేస్తే కేంద్రానికి అసూయ
రాష్ట్రంలో మంచి పనులు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వానికి అసూయగా ఉంది. ఉపాధి హామీ పథకం నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పను లు చేస్తే కేంద్రం కొర్రీలు పెడుతోంది. కేసీఆర్ ప్రధాన మంత్రి అయ్యే సమయం ఆసన్నమైంది.
– ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి
మండలంలో అభివృద్ధి పరుగులు..
కొత్తగా ఏర్పడ్డ వేలేరు మండలంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. 2014లో మా వేలేరు మండలం తీవ్ర కరువు కోరల్లో ఉండడంతో పాటు రవాణా సౌకర్యం కూడా లేదు. మా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కృషి, మా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సహకారంతో 2016లో 12గ్రామాలతో మండలంగా ఆవిర్భవించింది. అప్పటినుంచి అనేక అభివృద్ది పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు ప్రయత్నిస్తుంది.
– జడ్పీటీసీ చాడ సరితారెడ్డి