దుగ్గొండి, జూలై 17 : తెలంగాణలో వ్యవసాయం దండగా అనే క్రమం నుంచి పండుగ అనే స్థాయికి తీసుకొచ్చిన రైతు బాంధవుడు, రైతు రక్షకుడు సీఎం కేసీఆర్ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఉచిత కరెంటుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తెలియజేసేందుకు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం దుగ్గొండి మండల కేంద్రంలో రైతు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని రైతులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిదులు అధిక సంఖ్యలో హజరు కాగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు ఎడ్ల బండిపై ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు. అనంతరం రైతులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి అన్నదాతలకు అండగా నిలిచారన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించి 3 పంటలకు సరిపడా నీళ్లందిస్తున్న కేసీఆర్ పాలనను ఓర్వలేక అక్కసుతో 3 గంటల విద్యుత్ చాలన్న రైతు ద్రోహి రేవంత్‌రెడ్డిని తరిమికొట్టాలన్నారు. అన్నదాతలను ఆగం చేసే మాటలు మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి ఓ అజ్ఞాని అన్నారు.
రైతులను దగా చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను బట్టబయలు చేసేందుకు రైతులు ముందుకు వచ్చి గ్రామాల్లో చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు. ఇటీవల కురిసిన అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు రానున్న రెండు మూడు రోజుల్లో ఎకరాకు రూ.10 వేలు అందించనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది తెలిపారు. అతి త్వరలోనే రూ.లక్ష రుణ మాఫీ చేసి, రైతులను ఆదుకుంటామన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో పంట నష్టపోయిని 18 వేల మంది రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక జీవో ద్వారా 50 శాతం సబ్సిడీతో రూ.37.50కోట్ల వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలతోపాటు, పీవీసీ పైపు యునిట్లను అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ తోకల నర్సింహారెడ్డి, జిల్లా డైరెక్టర్ కాట్ల భద్రయ్య, వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్‌రెడ్డి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, బీఆర్ఎస్ నాయకులు వంగేటి అశోక్‌కుమార్, మేరుగు రాంబాబు, కంచరకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి భూంపెల్లి విజేందర్‌రెడ్డి, శంకేసి కమలాకర్, నీలం పైడయ్య, కామిశెట్టి ప్రశాంత్, పల్లాటి కేశవరెడ్డి, ఎంపీటీసీ మోర్తాల రాజు, యాదగిరి సుధాకర్ పాల్గొన్నారు.
కరెంట్ మంటల్లో కాంగ్రెస్ ఖతం
నల్లబెల్లి : కరెంట్ మంటల్లో కాంగ్రెస్ ఖేల్ ఖతమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని తెలంగాణ రైతాంగాన్ని అపహస్యం చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నల్లబెల్లి మండలంలోని రాంపూర్, మేడెపల్లి, నల్లబెల్లి గ్రామాల్లోని రైతు వేదికల వద్ద సోమవారం బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎడ్లకు, వడ్లకు తేడా తెలియని వ్యక్తి టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేయడం సిగ్గు చేటన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతను అణచి వేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందనడానికి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. రైతులకు కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ 24 గంటల విద్యుత్తు సరఫరా, కాళేశ్వరంలాంటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నో ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రైతులకు చేసింది శూన్యమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణను ఓర్వలేకే రేవంత్‌రెడ్డి రైతులపై కక్ష్య సాధింపు చర్యలకు పూనుకున్నాడని ఆరోపించారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గం అభివృద్ధికి రూ.కోట్ల నిధులు తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నర్సంపేటలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, అన్ని హంగులతో జిల్లా వైద్యశాల నిర్మాణంతోపాటు నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట గ్రామంలో హార్టీకల్చర్ రీసెర్చ్ స్టేషన్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్‌రావు, మాజీ ఎంపీపీలు బానోత్ సారంగపాణి, కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్‌లు చింతపట్ల సురేశ్రావు, లావూడ్యా తిరుపతి, రాజునాయక్, గోనె శ్రీదేవి, అమరేందర్‌రెడ్డి, మామిండ్ల మోహన్‌రెడ్డి, సిద్దూరి రత్నాకర్‌రావు, బానోత్ పూల్‌సింగ్, మోహన్‌రావు, క్లస్టర్ ఇన్చార్జీలు ఇంగ్లి శివాజి, కొత్తపల్లి కోటి లింగాచారి, మోహన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గోనెల పద్మ, నాయకులు నాగంపెల్లి కిరణ్, ఎండీ నజీమా పాల్గొన్నారు.
కాంగ్రెస్ కుట్రలపై చర్చ జరగాలి
24 గంటల ఉచిత కరెంటుపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలపై గ్రామాల్లో చర్చ పెట్టాలి. రాష్ట్రంలో వ్యవసాయానికి రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ అనవసరమంటూ 3 గంటలు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనడం దారుణం. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాటుపడుతుంటే మరోపక్క కాంగ్రెస్, బీజేపీలు రైతులపై కుట్రలు చేస్తున్నాయి. వెంటనే రైతులకు రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొంద పెట్టేందుకు రైతులు సిద్ధంగా ఉండాలి.
– తోకల నర్సింహారెడ్డి, రైతు బంధు సమితి దుగ్గొండి మండల కన్వీనర్