నర్సంపేట రూరల్, ఫిబ్రవరి 6: గిరిజన తండాల సమగ్ర అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఎస్టీ ఎస్డీఎఫ్ నుంచి నర్సంపేట డివిజన్లో 97.09 కిలో మీటర్ల మేర నూతన బీటీరోడ్లు మంజూరైనట్లు తెలిపారు. జీవో నంబర్ 189, 29, 203 ద్వారా రూ. 53.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని వివరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బీటీరోడ్లు మంజూరు చేయడం హర్షణీయమన్నారు.
బీటీరోడ్ల నిర్మాణంతో గిరిజన తండాలకు మహర్దశ వచ్చిందన్నారు. డివిజన్వ్యాప్తంగా ఉన్న అన్ని గిరిజన తండాలకు గ్రామ పంచాయతీలు, మండలకేంద్రాలను కలుపుతూ బీటీరోడ్లు నిర్మిస్తామన్నారు. ఈ రోడ్లతో మారుమూల తండాలు సైతం అభివృద్ధి పథంలో పయనిస్తామని వివరించారు. విద్య, వైద్యం, రవాణా తదితర సౌకర్యాలు గిరిజనులకు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే, జీపీలకు భవనాలు, అంతర్గత సీసీరోడ్లు, తాగు, సాగు నీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. బీటీరోడ్ల మంజూరుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నర్సంపేట డివిజన్లోని ఆరు మండలాల్లో 97.09 కిలో మీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ. 53.40 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నెక్కొండ మండలంలోని దేవునితండా, టేకుల తండా, రామన్నకుంటతండా, మహబూబ్నాయక్తండా, అవుసులతండా, వెంకట తండా(పెద్ద కోర్పోల్), గంగదేవితండా, నక్కలగుట్టతండా, సంగ్యాతండా, మంగ్యాతండా, బాల్నాయక్తండా, పెద్దమంగలితండా, చెరువుముందుతండా, పాతతండా, హరిచంద్‌తండా, దళపతితండా, గజ్యతండా, భవానిగడ్డతండా కలిపి మొత్తం 35 కిలో మీటర్లకు రూ. 22.08 కోట్లు మంజూరయ్యాయి.