నర్సంపేట, మే 14: నర్సంపేట నియోజకవర్గంలోని ఎస్టీ రైతులకు పోడు భూముల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలాఖరులో పట్టాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నల్లబెల్లి, ఖానాపురం మండలాల్లోని 3371 మంది రైతులకు గాను 7333 ఎకరాల విస్తీర్ణంలో పట్టాల ముద్రణ పూర్తయిందని తెలిపారు.
రాష్ట్రంలో త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా పట్టాల పంపిణీ ప్రారంభం కానున్నదని తెలియజేశారు. ఆ తర్వాత నర్సంపేటలో ప్రారంభం అవుతుందని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం 95 శాతం మందికి పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పరిశీలనలో మరో 360 దరఖాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. సర్వే పూర్తయిందని, హద్దులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. బీసీ, ఇతర కులాల పట్టాలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.