నర్సంపేట అక్టోబర్ 2: ప్రతిపక్షాలకు జెండాలు తప్ప.. ఎజెండాలు లేవని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని రాజుపేట రైతు వేదికలో క్లస్టర్ పరిధిలోని ముత్తోజిపేట, ఇటుకాలపల్లి, ఆకులతండా, రాజుపేట, ముత్యాలమ్మతండా, ఏనుగల్తండా, ఇప్పల్తండాలకు చెందిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పంట నష్టపరిహారం చెక్కులను ఎమ్మెల్యే పెద్ది పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపరిహారం చెక్కులు పార్టీలకు అతీతంగా రైతులకు అందజేస్తుంటే విపక్షాల వారు రోడ్లపైకి చేరి ఆందోళనలు చేయడం సిగ్గు చేటన్నారు. రైతు గతంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని వారికి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రతి పక్షాలు రాద్దాంతం సృష్టిస్తున్నాయని తెలిపారు.
నియోజకవర్గ వ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కోసం రూ.75కోట్లు మంజూరు కాగా, అందులో 50శాతం సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందులో పంట నష్టపరిహారం అందని రైతులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.51కోట్ల పరిహార సాయం మంజూరైతే, ఒక్క నర్సంపేట నియోజకవర్గానికే రూ.42కోట్లు అందిందని, 90శాతం నియోజకవర్గ రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ వెంట ప్రజలు ఉండాలని కోరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు కళ్లముందు కనిపిస్తున్నాయని చెప్పారు. నర్సంపేట ఏడీఏ తోట శ్రీనివాసరావు, ఏవో కృష్ణకుమార్, పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్‌రెడ్డి, కౌన్సిలర్ జుర్రు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, ఏఈవోలు మెండు అశోక్, భరత్, నవీన్ ఉన్నారు.
రాంపూర్ రైతు వేదికలో..
సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన పంట నష్టపరిహారం చెక్కులను సోమవారం మండలంలోని రాంపూర్ రైతువేదికలో పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.ప్రకృతి కన్నెర్ర చేయడంతో నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, సీఎం కేసీఆర్ నియోజ కవవర్గంలో పర్యటించి పంట నష్టాన్ని చూసి చెలించారని, దీంతో నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.10వేలు పరిహారం అందిస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 35,080 మంది రైతులకు 40వేల ఎకరాల్లో పంట దెబ్బతినగా నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.42కోట్లు విడుదల చేసిందని తెలిపారు.
అందులో మండలంలోని 1,619 మంది రైతులకు చెందిన 1,751 ఎకరాలకు మొదటి విడుతగా రూ.5.25కోట్లు పరిహారం మంజూరైందని వివరించారు. రాజకీయాలకతీతంగా నష్టపోయిన ప్రతి రైతుకు ఇస్తున్నట్లు తెలిపారు. దీన్ని విస్మరించిన కాంగ్రెస్ నాయకులు పరిహారం తీసుకుంటూనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తుండడం క్షమించేది లేదన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో జరుగుతున్న అభివృద్ధితో బీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణ కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు దిగడం సిగ్గు చేటన్నారు.
మెడికల్ కళాశాల, మండలంలోని కన్నారావుపేటలో హార్టికల్చర్ రీసెర్స్ సెంటర్ మంజూరు, అన్ని గ్రామాల్లో సీసీ, తార్ రోడ్లు, గోదావరి జలాలు తరలించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు మరోసారి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సర్పంచ్ చింతపట్ల సురేశ్రావు, ఏడీఏ శ్రీనివాస్‌రావు, ఏవో పరమేశ్వర్, ప్యాక్స్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్‌రావు, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ తక్కల్లపెల్లి మోహన్‌రావు, సర్పంచ్‌లు లావూడ్య తిరుపతి, రాజు, గోనె శ్రీదేవి, వైస్ ఎంపీపీ గందె శ్రీలత, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, గందె శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ గోనెల పద్మ, క్లస్టర్ ఇన్చార్జిలు ఇంగ్లి శివాజీ, మాలోత్ ప్రతాప్‌సింగ్, మీడియా ఇన్చార్జి గుమ్మడి వేణు పాల్గొన్నారు.
బాధిత రైతులందరికీన్యాయం చేస్తా : పెద్ది
ఖానాపురం: పంట నష్టపరిహారం చెక్కులు అందని రైతులకు యంత్ర పరికరాల్లో ప్రాధాన్యం కల్పించనున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో నష్టపోయిన 901మంది రైతులకు రూ.80.70లక్షల విలువైన చెక్కులను సోమవారం ధర్మరావుపేట రైతువేదికలో పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పంటనష్ట పరిహారం చెక్కులు వచ్చిన వారిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారని, అదేవిధంగా రానివారిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారని తెలిపారు. సాంకేతిక కారణాలతో కొందరికి నష్టపరిహారం అందలేదని, వారికి న్యాయం చేస్తానని చెప్పారు. కానీ కాంగ్రెస్ నాయకులు పంటనష్ట పరిహారం మంజూరైనప్పటికీ కావాలని ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని రోడ్డెక్కుతున్నారని, వారు చేసుకోవాలని అన్నారు. పరిహారం అంది రోడ్డెక్కుతున్న రైతులపై విచారణ చేపడతామని హెచ్చరించారు.
పంటనష్ట పరిహారం అందని రైతులకు రూ.10 వేలకు రూ.20 వేల లాభం చేకూరేలా సబ్సిడీ యంత్ర పరికరాలు అందిస్తామని చెప్పారు. చెక్కులు రాని రైతులకు వారం రోజుల్లో వీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ధర్మరావుపేట పంట భూములు పాకాల చివరి ఆయకట్టులో ఉన్నాయని, గతంలో కాంగ్రెస్ నాయకులు కాల్వల లైనింగ్ పేరుతో రూ.కోట్లు మింగి కాల్వలను నిరూపయోగంగా మార్చారని, దీంతో ఏటా చివరి ఆయకట్టు ఎండిపోతోందని పేర్కొన్నారు. ఈ పాపం కాంగ్రెస్ పాలకులదేన చెప్పానిరు.
తనను మరోసారి గెలిపిస్తే పాకాల పంటకాలువలను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తానని హామీ ఇచ్చారు. పాకాల ఆయకట్టులో ఇప్పటికే రెండు పంటలకు నీళ్లిస్తున్నామని, రాబోయే రోజుల్లో 3 పంటలకు నీళ్లిచ్చి తీరుతామన్నారు. ధరర్మారావుపేట చుట్టూ అన్నిగ్రామాలకు, తండాలకు బీటీ కనెక్టివిటీ చేసానన్నారు. త్వరలోనే పాకాలవాగుపై రూ.7కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడతానన్నారు. దీంతో చెన్నారావుపేటకు ధర్మారావుపేటకు రవాణా సౌకర్యం మెరుగవుతుందని, భూములకు రేట్లు పెరుగుతాయన్నారు. ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఏడీఏ తోట శ్రీనివాసరావు, ఏఓ శ్రీనివాస్, సర్పంచ్ వెన్ను శ్రుతి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య పాల్గొన్నారు.