జనగామ, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : ‘ఏడు దశాబ్దాల అన్యాయాన్ని పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సరిచేస్తే.. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే ప్రయత్నంలో మళ్లీ ఆంధ్రుల కుట్రలు మొదలయ్యాయి.. రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్ల పాలన విధ్వంసంతో సాగింది.. పండించడానికి కాదు.. పంట అమ్ముకోవడానికి అరిగోస పడుతున్న రైతుల వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే కొత్త డిస్కంపై మరో పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలి’.. అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
జనగామ ఆర్టీసీ చౌరస్తా వద్ద జాతీయ జెండా, పార్టీ పతాకాలను ఆవిష్కరించిన అనంతరం బీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనను గ్రామగ్రామాన పార్టీలకతీతంగా తలుచుకుంటున్న ప్రజలు ‘మేం మోసపోయాం.. మాయమాటలకు ఓటేసి గోస పడుతున్నా’మని ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి ఇతర రూపాన్ని పెట్టడం బాధాకరమని.. అందుకే తాను కాంగ్రెస్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి వెళ్లకుండా స్ఫూర్తినిచ్చిన అసలైన విగ్రహానికి పార్టీ కార్యాలయంలో నివాళులర్పించానని స్పష్టం చేశారు. కాకతీయుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటింది తెలంగాణ అని.. సుమారు 1200 ఏళ్ల క్రితమే టెక్నాలజీ లేకున్నా కాకతీయులు 75 వేల గొలుసుకట్టు చెరువులు నిర్మించిన వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచంలో ఎకడా లేదన్నారు. కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలే ఎకువగా బాధపడ్డారని అన్నారు.
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని చెప్పడం దురదృష్టకరమని.. అవి కేవలం భౌతిక గుర్తులే కాదు, అభివృద్ధి చిహ్నాలని.. తకువ ఖర్చుతో, అద్భుతం గా నిర్మించిన రాష్ట్ర సచివాలయాన్ని గుర్తు చేశారు. ప్రపంచంలోనే ఎకడా లేని విధంగా డాక్టర్ బీఆర్ అంబేదర్ 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేశామన్నారు. కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే సీఎం పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో 30 మెడికల్ కాలేజీలు, అధునాతన దవా ఖానలు, వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద ఆ స్పత్రి 90 శాతం పూర్తయినా మిగిలిన నిధులు ఇవ్వకుండా ఆపేశారన్నారు.
దేవాదుల ప్రాజె క్టు, సమ్మక-సారలమ్మ బరాజ్, ప్రపంచంలోనే అతిపెద్ద 42 కిలోమీటర్ల టన్నెల్ వంటి అనేక ప్రాజెక్టులు కేసీఆర్ పాలనలోనే సాధ్యమయ్యాయని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక్ సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ నుంచి ఆలేరు వరకు అం దుతున్న నీళ్లు కేసీఆర్ ఆనవాళ్లేనని చెప్పారు. రైతు లు కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు ఇబ్బంది పడుతున్నారని, లారీలు రావడం లేదు.. గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదన్నారు.
2014లో వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలి చి.. 2022లో 142లక్షల మెట్రిక్ టన్నుల వరిని ఎఫ్‌సీఐకి సరఫరా చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. రైతు డిసంల నెపంతో మోటర్లకు మీట ర్ల పేరుతో అన్నదాతలకు నష్టం చేయాలని చూస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఖండించాలని, తెలంగా ణ ప్రజలు మళ్లీ చైతన్యం పొందాల్సిన అవసరం ఉం దని, రైతు వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ చైర్మన్ బాలనర్సయ్య, జనగామ మున్సిపల్ వైస్ చైర్మన్ పర్వతాలు, మార్కెట్ మాజీ, మున్సిపల్ చైర్మన్లు ప్రేమలతారెడ్డి, బండ పద్మ, బీఆర్ఎస్ నాయకులు గాంధీనాయక్, బండ యాదగిరిరెడ్డి, గద్దల నర్సంగారావు, బాల్దె సిద్ధిలింగం, కందుకూరి ప్రభాకర్, పసుల ఏబెల్, శారద, పల్లవి, సింధురెడ్డి, భాగ్యలక్ష్మి, సురేశ్‌రెడ్డి, మామిడాల రాజు, ఉల్లెంగుల సందీప్, చంద్రారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.