న్యూశాయంపేట, సెప్టెంబర్ 26 : వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ హంటర్‌రోడ్ పద్మాక్షిరోడ్డులోని చాకలి ఐలమ్మ జయంతిని హనుమకొండ జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి ఎంపీ కడియం కావ్య, ఎమ్మేల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ స్నేహ శబరీష్, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు, కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వివక్షపై చాకలి ఐలమ్మ వీరోచితంగా పోరాడారని గుర్తుచేశారు.
ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని మలిదశ తెలంగాణ ఉద్యమం సాగిందని చెప్పారు. సామాజిక అసమానతలకు, భూ దోపిడీకి, జమీందారీ శాసనానికి వ్యతిరేకంగా పోరాడారు. ఆమె ధైర్యం, పట్టుదల మనందరికి ఆదర్శం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సురేందర్, కుమార్‌యాదవ్, అధికారులు, పాల్గొన్నారు.