కరీమాబాద్, డిసెంబర్ 24: రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఉర్సు నాగమయ్య గుడి సమీపంలో 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ ఆధ్వర్యంలో రూ. 30 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ డివిజన్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తానన్నారు. ప్రతి కాలనీలో అధునాతన సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టి స్థానికులకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గంలో అనేక పనులు చేశామన్నారు. మరిన్ని అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డివిజన్లో పలు కాలనీల్లో తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పోశాల పద్మ, సిద్దం రాజు, పోశాల స్వామి, బజ్జూరి రవి, కలకోట్ల రమేశ్, ఈదుల రమేశ్, ఈదుల భిక్షపతి, కొర్లపాటి రవీందర్, యాదగిరి పాల్గొన్నారు.
కార్మికుల సంక్షేమానికి కృషి
గిర్మాజీపేట: మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం శివనగర్‌లోని క్యాంపు కార్యాలయ ఆవరణలో 32, 33, 34, 39వ డివిజన్ల హెల్త్ ఆఫీసర్, సూపర్వైజర్లు, జవాన్లు, కార్పొరేషన్ సిబ్బంది సమక్షంలో ప్రీక్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భారీ కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, దేశంలో ఎక్కడా లేనివిధంగా పండుగలకు రాష్ట్రంలో ప్రభుత్వం కానుకలు అందిస్తుండడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు ముష్కమల్ల అరుణా సుధాకర్, బోగి సువర్ణ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అలాగే, పెరికవాడలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో వస్తువులు కాలిపోగా గోధుమల లీల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. అధైర్య పడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ 33వ డివిజన్ అధ్యక్షుడు మీరిపెల్లి వినయ్‌కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
దశలవారీగా సమస్యల పరిష్కారం
పోచమ్మమైదాన్: వరంగల్ దేశాయిపేటలోని లక్ష్మి మెగాటౌన్షిప్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే నరేందర్ అన్నా రు. దేశాయిపేటలో ఆయన పర్యటించి లక్ష్మి మెగా టౌన్‌షిప్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మెయిన్‌రోడ్డు, అంతర్గతరోడ్లు, డ్రైనేజీ, అదనపు విద్యుత్ స్తంభాలు, హైమాస్ట్ లైట్లు, మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు, కమిటీ హాల్, పార్కు అభివృద్ధిపై వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట కార్పొరేటర్ కావటి కవితా రాజు ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే దేశాయిపేటలో ఏర్పాటు చేసిన ధర్మరుద్ర క్లినిక్‌ను ప్రారంభించారు. అలాగే, క్రిస్మస్ను పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకురాలు మంచాల జోత్స్న ఆధ్వర్యంలో దేశాయిపేటలో మున్సిపాలిటీ కార్మికులకు నన్నపునేని దుస్తులు పంపిణీ చేశారు.