మహబూబాబాద్ రూరల్, జూన్ 8 : ‘మా ఓట్లతో గెలిచి అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తవా’ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్‌కు ఆదివారం గిరిజనులు అడ్డగించారు. పట్టణానికి చెందిన ప్రముఖ డాక్టర్ ప్రమోద్ రెడ్డి పది మంది గిరిజన రైతులకు సంబంధించిన 30 ఎకరాల భూమిని ఆక్రమించి, అందులో పెద్దపెద్ద భవనాలతో పాటు ఓ పాఠశాల భవనాన్ని సైతం నిర్మించాడని ఆరోపించారు.
ఆదివారం స్కూల్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వెళ్తున్న క్రమంలో గిరిజన రైతులు అడ్డుకొని రోడ్డుపై ఆందోళన చేశారు. గిరిజన రైతులకు అండగా నిలవకుండా ప్రమోద్‌రెడ్డికి సపోర్ట్ చేస్తూ పాఠశాల ప్రారంభోత్సావానికి ఎలా వెళ్తావు అని ఎమ్మెల్యేను నిలదీశారు. సమాచారం తెలుసుకున్న టౌన్ పోలీసులు, సీఐ పెండ్యాల దేవేందర్ అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకపోవడంతో చాలా సేపు వాహనంలోనే ఉండి చేసేదేమీ లేక ఎమ్మెల్యే మురళీనాయక్ స్కూల్ ప్రారంభించకుండానే తిరిగి వెళ్లాడు.
కాగా, గిరిజన రైతులు బోడ రమేశ్ నాయక్, భూక్యా శ్రీను మీడియాతో మాట్లాడుతూ శనిగపురం శివారులోని 275,278,279 సర్వే నంబర్లో 30 ఎకరాల గిరిజనులకు సంబంధించిన భూమిని ప్రమోద్ రెడ్డి, అతని అనుచరులు కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి రెవెన్యూ వ్యవ స్థను తప్పుదోవ పట్టించారన్నారు. ఈ భూములను కబ్జా చేసినందుకు గతంలో ప్రమోద్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఆదేశాల మేరకు పోలీసులు పూర్తి విచారణ సైతం చేశారని పేర్కొన్నారు.
అనేక సంవత్సరాల నుంచి తమ భూముల గురించి అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నా వారు అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే గిరిజన భూములపై పూర్తి విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన రైతులు బాలాజీనాయక్, లాల్‌సింగ్ నాయక్, రవీందర్‌నాయక్, మ ల్సూర్, భిక్షం, కిరణ్ నాయక్, సంతోష్, వీరేందర్, రూప్లి బాయి, శాంతి, తార, కల్పన, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.