మహబూబాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్‌కు తన సొంత ఊరిలోనే చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామ పరిధిలోని సోమలతండాలో అధికారులు నిర్వహించిన గ్రామసభలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. అధికారులు లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు అర్హులుకాని వారి పేర్లు జాబితాలో వచ్చాయని, అర్హులైన తమవి ఎందుకు రాలేదని ఎమ్మెల్యేను నిలదీశారు.
రైతు భరోసాకు తాము అర్హులం కాదా? అంటూ గ్రామసభ ప్రారంభం కాగానే ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. దీంతో అధికారులు ప్రజలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా, గొడవ సద్దుమణుగలేదు. గ్రామస్తులు, మహిళలు ఎదురుతిరగడంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే మురళీనాయక్ అర్హులు ఎవరున్నా ఇక్కడే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నామని, ఎన్నిసార్లు అర్జీ పెట్టుకోవాలని ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. చివరకు గొడవ సద్దుమణగడంతో నియోజకవర్గ కేంద్రానికి ఎమ్మెల్యే బయలుదేరి వెళ్లారు.