శాయంపేట, ఫిబ్రవరి 22 : మండలానికి త్వరలోనే అంబులెన్స్ కేటాయిస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం మండలంలోని జోగంపల్లి జాతరలో సమ్మక్క-సారలమ్మ గద్దెలకు మొక్కులు చెల్లించారు. అనంతరం మాట్లాడుతూ.. జాతరలో కమ్యూనిటీ భవనం, ప్రహరీ, గేటు ఏర్పాటుకు సీడీఎఫ్ నిధులు మంజూరు చేస్తానన్నారు. కాట్రపల్లి, రాజుపల్లి, కొప్పుల గ్రామాలకు బస్సులను పునరుద్ధరిస్తామన్నారు. గత వర్షాలకు చెరువులు దెబ్బతిన్నాయని, వాటి పునరుద్ధరణకు రూ.69కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు.
ఎస్సారెస్పీ కాల్వకు నీళ్లు రావడం లేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఎస్ఈతో మాట్లాడారు. 26న శాయంపేటలో తాగునీరు, విద్య, వైద్యం తదితర శాఖలపై సమావేశం ఏర్పాటు చేయాలని ఎంపీవో రంజిత్‌కు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ అబ్బు ప్రకాశ్‌రెడ్డి, కోశాధికారి అమ్మ అశోక్, పోలెపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దూదిపాల బుచ్చిరెడ్డి, పన్నాటి జలేందర్, పరిపూర్ణాచారి, చిందం రవి, మారెపల్లి బుజ్జన్న, కుమారస్వామి, పత్తి శ్రీను, కుక్కల భిక్షపతి పాల్గొన్నారు.
సమ్మక్క-సారలమ్మ తల్లుల దీవెనలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని జోగంపల్లి జాతరలో గురువారం వారు మొక్కులు చెల్లించారు. అనంతరం మాట్లాడుతూ గతంలో రవాణా వ్యవస్థ బాగా లేని సమయంలో మేడారం వెళ్లలేని ప్రజలు బండ్లు, వాహనాల్లో మినీ జాతరలకు వచ్చి అమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేవారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.