హనుమకొండ, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుత అభివృద్ధి సాధిస్తూ అనతి కాలంలోనే దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం హనుమకొండలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ విప్, మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, సీపీ రంగనాథ్‌తో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ గౌరవ వందనం స్వీకరించి, జిల్లా అభివృద్ధిని శాఖల వారీగా వివరించారు. ముందుగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సమర యోధులు, ప్రజా ప్రతినిధులు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థినీ విద్యార్థులు, జర్నలిస్టులతో పాటు జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రలో 1948 సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని,76 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన నేపథ్యంలో ఇటీవల దేశంలో ఏ రాష్ట్రంలో నిర్వహించనంత ఘనంగా తెలంగాణలో భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకున్నామని తెలిపారు. ఆనాటి యోధుల వెలకట్టలేని త్యాగాలను తలచుకోవడం మన బాధ్యత అని చీఫ్ విప్ తెలిపారు.
మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలి
ఆదివాసీ యోధుడు కుమ్రం భీమ్, తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డికొమురయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, వీర వనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, దేవులపల్లి వేంకటేశ్వర్ రావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగం వెలకట్టలేనిదన్నారు. వారి స్ఫూర్తితో ప్రజల మధ్య ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకుందామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు.
రైతు సంక్షేమమే లక్ష్యం
రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర సర్కారు రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో రైతాంగానికి ప్రతి ఎకరాకు రూ. 5వేల ఐదు వేల చొప్పున పంట పెట్టుబడిగా, ఈ వానకాలంలో ఇప్పటి వరకు 1,43, 913 మంది రైతులకు రూ.132.56 కోట్లు పంట పెట్టుబడిగా ఇవ్వడం జరిగిందన్నారు.
ఆత్మ గౌరవంతో జీవించేందుకు ఆసరా పెన్షన్లు
జీవితంలో ఏ ఆధారం లేని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, బీడీ కార్మికులు, బోదకాలు, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొప్ప పథకం ఆసరా పెన్షన్ల పథకం అని చీఫ్ విప్ దాస్యం పేర్కొన్నారు.
సంక్షేమానికి సర్కారు కృషి
రాష్ట్ర సర్కారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తుందని చీఫ్ విప్ పేర్కొన్నారు. అలాగే జిల్లాలో ఏప్రిల్ 2023 నుంచి దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమానికి తల్లిదండ్రుల పోషణ సంరక్షణ కోసం ఆన్లైన్ వెబ్సైట్ ప్రారంభించినట్లు తెలిపారు.
వైద్యారోగ్య శాఖ ద్వారా..
జిల్లాలో ఆరోగ్యశ్రీలో భాగం గా 28 వేల 972 మంది వ్యాధిగ్రస్తులకు రూ. 59,48, 82, 212లతో నెట్వర్ ఆస్పత్రులలో శస్త్ర చికిత్స చేయించడం జరిగిందని తెలిపారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగం గా మొదటి విడతలో 176 పాఠశాలల్లో మౌలిక వసతు లు కల్పించినట్లు పేర్కొన్నారు.
స్వయం సహాయక సంఘాలకు రూ. 62.08కోట్లు
మెప్మా ద్వారా 2023-24 సంవత్సరంలో ఇప్పటివరకు పట్టణ పరిధిలో గల 705 స్వయం సహాయక సంఘాలకు రూ.62.08కోట్లు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు అందించామన్నారు. గృహలక్ష్మి పథకం కింద స్వంత స్థలం ఆహార భద్రత కార్డున్న పేదలకు 8 వేల 400 గృహాలు కేటాయించడం జరిగిందని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని చీఫ్ విప్ తెలిపారు.
పరిశ్రమల శాఖ ద్వారా …
హనుమకొండ జిల్లాలో 2022-23 సంవత్సరానికిగాను అర్హతగల కలిగిన పరిశ్రమల సేవారంగంలో ఎస్సీ, ఎస్టీ వారికి టీ ప్రైడ్ ద్వారా రాయితీలను మంజూరు చేస్తున్నట్లు చీఫ్ విప్ తెలిపారు.
మహత్తర పథకం దళిత బంధు
మహత్తర పథకం దళిత బంధు పథకం అని వినయ్ భాస్కర్ అన్నారు.ద ళిత సాధికారత పేరుతో దళిత బంధు పథకానికి సర్కారు నిధులు కేటాయిస్తుందని తెలిపారు. ఎస్సీ కులాల లబ్ధిదారులకు ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా ఒకొకరికి రూ. 10 లక్షలు అందజేసే మహత్తర పథకం అని అన్నారు.
రూ. 4500 కోట్లతో వరంగల్ నగర అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్ర బడ్జెట్ నుంచి వరంగల్ నగర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నారని చీఫ్ విప్ తెలిపారు. వరంగల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత 9 ఏండ్లలో వివిధ పథకాల క్రింద రూ.4500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి వరంగల్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఈ రెండు నెలల్లో సుమారు రూ. 250 కోట్ల పై చిలుకు పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో రూ. 204 కోట్ల వ్యయంతో 538 అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్‌జీ, ట్రెయినీ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.