పోచమ్మమైదాన్, ఫిబ్రవరి 3 : వరంగల్ కొత్తవాడలో తయారు చేస్తున్న చేనేత ఉత్పత్తులకు మిజోరం రాష్ట్ర టీం మెంబర్లు ఫిదా అయ్యారు. ఓరుగల్లులో నేత కార్మికుల ఉత్పత్తులను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి దర్రీస్లు మా దగ్గర లేవంటూ కార్పెట్స్, బెడ్‌షీట్స్ పరిశీలించి, ప్రశంసించారు. తెలంగాణ చేనేత రంగానికి భౌగోళిక గుర్తింపు రావడంతో మిజోరం రాష్ట్ర అధికారులు, వీవర్స్ కొత్తవాడలో తయారు చేస్తున్న చేనేత ఉత్పత్తులను పరిశీలించడానికి స్థానిక మట్టెవాడ చేనేత సహకార సంఘాన్ని శుక్రవారం సందర్శించారు. మిజోరం రాష్ట్ర పంచాయతీ రాజ్ అధికారులు, తెన్జోల్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, పలువురు వీవర్స్ విచ్చేశారు. వీరితో పాటు చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాఘవరావు, డెవలప్మెంట్ ఆఫీసర్ బొట్టు వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ సందర్భంగా వారు సంఘంలో పలు మగ్గాలపై తయారు చేస్తున్న దర్రీస్ను పరిశీలించారు. అలాగే ఇప్పటికే తయారు చేసిన ఉన్న కార్పెట్లు, బెడ్షీట్లను చూశారు.
చేనేత ఉత్పత్తుల తయారీ విధానాన్ని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి దారం వాడతారు? పొడవు, వెడల్పు ఎలా ఉంటుంది, ఎన్ని రకాల ఉత్పత్తులు నేస్తున్నారంటూ వివరంగా అడిగి నివృత్తి చేసుకున్నారు. ఇక్కడ తయారు చేస్తున్న నేత ఉత్పత్తులు చాలా బాగున్నాయని కితాబు ఇచ్చారు. ఇలాంటివి తమ రాష్ట్రంలో కూడా తయారు చేయించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. నేత ఉత్పత్తులు తయారు చేయడానికి ఎమేమి వాడుతున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, సంఘానికి, కార్మికుడికి ఎంత లాభం వస్తుందో అడిగి తెలుసుకున్నారు. తమ దగ్గర కన్నా ఇక్కడ తయారు చేస్తున్న నేత, కళంకారి బట్టలు భలే బాగున్నాయంటూ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి అందిస్తున్న వివిధ పథకాలను వివరించారు. ఆయా సంఘాల్లో తయారు చేసిన ఉత్పత్తులను టెస్కో ద్వారా విక్రయిస్తామని, హాస్టల్ విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాలకు అందజేస్తున్నట్లు వివరించారు. సంఘం ప్రతినిధులు మదనయ్య, ఓదెలు, సాంబయ్య, మల్లేశం పాల్గొన్నారు. అలాగే ఆటోనగర్‌లోని చేనేత సంఘంలో హాల్ కార్పెట్, వీవర్స్‌కాలనీ ఉప్పు మల్లయ్య తోటలో నేత ఉత్పత్తులను పరిశీలించారు. కార్యక్రమంలో మిజోరం పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్, టీం లీడర్ దొరతి మాన్సంఘీ, స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ జాన్ లాల్నున్జంగా, డిస్ట్రిక్ట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎఫ్ లాల్‌ని సాయి తదితరులు పాల్గొన్నారు.