సుబేదారి, జనవరి28: మైనర్ ‘ప్రేమ’ ప్రాణం తీసింది. ఇద్దరూ ఒకే కళాశాలలో చదవడం ప్రేమకు దారితీసింది. ఈ పరిచయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కలుసుకునే వరకు వచ్చింది. బాలిక ఇంట్లో ప్రియుడు ఉండగా, తండ్రి రావడంతో పారిపోయాడు. దీంతో తండ్రి మందలించగా, భయం, అవమానంతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురి మరణాన్ని తట్టుకోలేని తండ్రి ప్రియుడిపై దాడి చేశాడు. ఈ ఘటన హనుమకొండ నగరంలోని కాకతీయ పోలీస్ స్టేషన్ పరిధి గోపాల్పూర్ శ్రీనగర్ కాలనీలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. శ్రీనగర్ కాలనీకి చెందిన బాలిక వరంగల్ నగరంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నది. ఏడాది క్రితం ఇదే కళాశాలలో సెకండియర్ చదువుతున్న కూతాటి భరత్‌తో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు అతడు బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది.
ఈక్రమంలో మంగళవారం బాలిక ఇంటికి పేరెంట్స్ లేని సమయంలో భరత్ వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత విద్యార్థిని తండ్రి, మేనమామ వచ్చారు. ఇంట్లో భరత్ కనిపించడంతో ఎవరని కూతురిని తండ్రి మందలించాడు. గోడ దూకి పారిపోతున్న భరత్‌ను పట్టుకోవడానికి తండ్రి, మేనమామ బయటకు వెళ్లారు. తండ్రి ప్రియుడిని పట్టుకొని ఇంటికి తీసుకువచ్చే సరికే కూతురు ఉరిపెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తండ్రి కోపంతో కత్తితో భరత్ మెడపై దాడి చేయగా అతడు తప్పించుకొని పారిపోయాడు. వెంటనే బాలికను చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కేయూసీ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.