సుబేదారి, మార్చి 18 : ఇన్స్టాగ్రామ్ ద్వారా బాలికను పరిచయం చేసుకొని ట్రాప్ చేసి గంజాయి మత్తుకు అలవాటు చేశారు. ఆపై కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడడమే కాకుండా వ్యభిచార రొంపిలో దింపేందుకు యత్నించింది ఓ ముఠా. తమకు అందిన ఫిర్యాదుతో పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, కారు, రూ.75 వేల నగదు, 1.800 కిలోల గంజాయి, కండోమ్స్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం సీపీ సన్‌ప్రీత్ సింగ్ నిందితుల అరెస్ట్‌ను చూపించి, వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 11న బాలిక మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదెళ్ల గ్రామానికి చెందిన ముస్కు లత పడుపు వృత్తి చేసేది. ఈ క్రమంలో తల్లిదండ్రులు లేని ఓ బాలికను పరిచయం చేసుకొని తన ఇంటి వద్ద ఉంచుకున్నది. సులభంగా డబ్బులు సంపాదించాలంటే మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచార రొంపిలోకి దింపాలని బాలికకు చెప్పింది. సదరు బాలిక పథకం ప్రకారం ఇన్స్టాగ్రామ్ ద్వారా బాలికలను పరిచయం చేసుకోవడానికి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా తొలుత వరంగల్ నగరంలో పరిచయం ఉన్న బాలికను ట్రాప్ చేయడానికి ప్రయత్నించగా కుదురలేదు. మిల్స్‌కాలనీ పోలీసుస్టేషన్ పరిధిలోని బాధిత బాలికను ఇన్‌స్టాలో పరిచయం చేసుకొని, స్కూల్‌కు వెళ్లే క్రమంలో కలుస్తూ దగ్గరైంది.
ఈ క్రమంలో మైనర్ నిందితురాలు వరంగల్ నగరం శంభునిపేటకు చెందిన తన ప్రేమికుడు అబ్దుల్ అఫ్నాన్‌తో బాధిత బాలికకు బట్టలు కొనిచ్చి, అతడి ద్వారా గంజాయి మత్తుకి అలవాటు చేసింది. ఈ నెల 11న మైనర్ నిందితురాలు బాలికను ఇంటినుంచి బయటకు రప్పించి, అబ్దుల్ అఫ్నాన్తోపాటు శంభునిపేటకు చెందిన షేక్ సైలానీబాబా, మహ్మద్ అల్తాఫ్ సాయంతో కారులో ఎక్కించుకొని, మీర్జా ఫైజ్ బేగ్ వద్ద గంజాయి కొని నర్సంపేటకు వెళ్లారు. అక్కడ షేక్ సైలాని బాబాకు చెందిన పాత ఇంటికి తీసుకెళ్లి బాలికకు గంజాయి తాగించారు. మత్తులోకి వెళ్లిన తర్వాత సైలానీ బాబా లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత లైంగికదాడి చేస్తుండగా వీడియోలు తీశామని, తాము చెప్పినట్లు చేయాలని, ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతామని బాధిత బాలికను బెదిరించి, ములుగు రోడ్డు వద్ద వదిలేసి వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పక్కా సమాచారం మేరకు ప్రధాన నిందితురాలు ముస్కు లత, మైనర్ నిందితురాలు, అబ్దుల్ అఫ్నాన్, షేక్ సైలానీబాబా, అల్తాఫ్, మీర్జాఫైజ్బేగ్ను అరెస్ట్ చేసి, గంజాయి, కారు, నగదు, సెల్ఫోన్లు, 4,300 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని, నిందితులపై పాత కేసులు ఉన్నాయని సీపీ తెలిపారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా, ఏసీపీ నందిరాంనాయక్, ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, ఎస్సైలు శ్రీకాంత్, సురేశ్, సిబ్బందిని సీపీ అభినందించారు.