పోచమ్మమైదాన్/దేవరుప్పుల/మహదేవపూర్, ఆగస్టు 7 : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతన్నలు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు చేతుల మీదుగా కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను అందుకున్నారు.
హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వరంగల్ నగరంలోని కొత్తవాడ నేతన్నలు ఆడెపు శ్రీనివాస్, సామల సదానందం, జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోలుకొండకు చెందిన పాము భిక్షపతి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన గోరంట్ల శ్రీనివాస్‌కు అవార్డుతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
అలాగే సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా కార్పెట్లను వివిధ దేశాలకు పరిచయం చేసిన వరంగల్‌కు చెందిన ఉన్నత విద్యావంతుడు చిప్ప కిరణ్‌కుమార్ ప్రశంసా పత్రం అందుకున్నారు. కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పప్పుల వెంకటేశం, డిప్యూటీ డైరెక్టర్ ఇందుమతి, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళి తదితరులు పాల్గొన్నారు.