ములుగు, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ) : యునెస్కొ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లో ఇన్టాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు తదితరులతో కలిసి అధికారులతో రామప్ప అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు.
తెలంగాణలో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఏకైక కట్టడం రామప్ప అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి యునెస్కొ విధించిన గడువులోపు పనులు పూర్తి చేయాలన్నారు. త్వరలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ సైతం ములుగులో ఏర్పాటు కాబోతున్నదన్నారు. వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు, ప్రపంచ దేశాలకు చాటిచెప్పే యజ్ఞంలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలన్నారు.
ఆలయానికి, చెరువుకు ఆటంకం కలిగించే అభివృద్ధి పనులకు అనుమతులు ఇవ్వబోమని సీతక్క స్పష్టం చేశారు. సమావేశంలో కలెక్టర్ టీఎస్ దివాకర, ఇరిగేషన్ సీఈ విజయ్‌భాస్కర్‌రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాపారావు, టూరిజం ప్రిన్సిపల్ కార్యదర్శి వాణీప్రసాద్, కాకతీయ ట్రస్ట్ సభ్యుడు శ్రీధర్‌రావు, పురావస్తు శాఖ సూపరింటెండెంట్ స్మిత ఎస్ కుమారి, టూరిజం ఎండీ ప్రకాశ్‌రెడ్డి, పురావస్తు శాఖ డీడీ నారాయణ, సీఏ మల్లేశ్, రామప్ప ఈవో శ్రీనివాస్, డీటీవో శివాజీ తదితరులు పాల్గొన్నారు.