నమస్తే నెట్వర్క్, ఆగస్టు 6 : ఉద్యమ నేతపై అభిమానం వెల్లువెత్తింది. తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఆయా కలెక్టరేట్లు, బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వివిధ సంస్థలు, చౌరస్తాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ములుగులో మంత్రి సీతక్క కలెక్టర్ దివాకరతో కలిసి ప్రొఫెసర్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు.
తెలంగాణ సిద్ధాంత కర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన వ్యక్తి ఆచార్య జయశంకర్ అని మంత్రి కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సార్ చేసిన కృషిని, దృఢ సంకల్పాన్ని ఎప్పటికీ మరిచిపోలేరని అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనం(ఏకశిలా పారు)లోని సార్ విగ్రహానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే నాగరాజు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, కలెక్టర్ ప్రావీణ్య, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సార్ ఆలోచనలు కిందిస్థాయికి తీసుకెళ్లి జాగృతం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని బండా ప్రకాశ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణే శ్వాసే ధ్యాసగా జీవించిన మహనీయుడు జయశంకర్ సార్ అని, ఆయన చూపిన బాటలో పయనిస్తామని అన్నారు. జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సార్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు.