ఎల్కతుర్తి/భీమదేవరపల్లి, ఆగస్టు 8 : ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీ కింద అందిస్తున్న పథకాలను రైతులు వినియోగించుకోవాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. గురువారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్, మల్లారం రైతువేదికల్లో వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖల అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రైతులు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రభుత్వాలు అందించే సబ్సిడీ పథకాలపై రైతులకు సరైన అవగాహన లేక వాటిని వినియోగించుకోలేక పోతున్నారని అన్నారు. రైతులు తమకు నచ్చిన పథకాలకు సంబంధించి అధికారులకు దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని, బ్యాంకు అధికారులతో సైతం మాట్లాడతానన్నారు. దేవాదుల ప్రాజెక్టు కాలువలకు మరమ్మతు పనులు పూర్తిచేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందేలా చూస్తానన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేసిందని, త్వరలోనే రూ. 2లక్షల వరకు మాఫీ చేస్తుందన్నారు. అనంతరం ఎల్కతుర్తి మహిళా సంఘాల గ్రూపులకు రూ. 3.12 విలువైన చెక్కులను అందజేశారు. ఆర్డీవో వెంకటేశ్, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఏడీఏ దామోదర్‌రెడ్డి, ఉద్యాన శాఖ జిల్లా అధికారి సుష్మిత, తహసీల్దార్లు జగత్సింగ్, ప్రవీణ్, ఎంపీడీవోలు విజయ్‌కుమార్, వీరేశం, ఎల్సీఎస్ చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్, ఎల్కతుర్తి నాయకులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, సుకినె సంతాజీ, గోలి రాజేశ్వర్‌రావు, బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, భీమదేవరపల్లి నాయకులు చిట్టి ఐలయ్య, కొలుగూరి రాజు, ఆదర్ రవీందర్, మూసకోయిల ప్రకాష్, చంద్రశేఖర్‌గుప్తా, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.