వరంగల్, సెప్టెంబర్ 24 : గ్రేటర్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల నిరసనలు, నినాదాల మధ్య బల్దియా ఆవరణంతా దద్దరిల్లింది. సమావేశం ప్రారంభానికి ముందే బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ప్రధాన గేట్ల ఎదుట బైఠాయించి మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు వరంగల్ కార్పొరేషన్‌లోని కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన బల్దియా సర్వసభ్య సమావేశం గందరగోళంగా మారింది.
బీఆర్ఎస్ సభ్యులు మేయర్ పోడియం వద్దకు దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. అయినా మేయర్ పక్షపాత వైఖరి అవలంబించడంతో సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. తొలుత ఇటీవల మృతిచెందిన 61వ డివిజన్ కార్పొరేటర్ ఎలకంటి రాములు, మాజీ కార్పొరేటర్ యెలుగం శ్రీనివాస్‌లకు సంతాపం తెలుపుతూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఆ తర్వాత కౌన్సిల్ ముందుంచిన 17 ఎజెండా అంశాల్లో 16 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. మంత్రి కొండా సురేఖ బల్దియా ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. వంద కోట్ల నిధులు ప్రత్యేకంగా నగరాభివృద్ధికి కేటాయించాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపి కౌన్సిల్లో తీర్మానం చేశారు.
అధికారులపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు ఏం చేస్తున్నారంటూ మంత్రి సురేఖ మండిపడ్డారు. మెప్మా విభాగం టీఎంసీ రమేశ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్పీల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని పద్ధతి మార్చుకోవాలని రమేశ్‌ను మంత్రి మందలించారు.
17 ఎజెండా అంశాల్లో 16 అంశాలకు స భ్యులు ఆమోదం తెలిపారు. విధి నిర్వహణలో ప్రమాదాలకు గురై మృతిచెందిన కార్మికుడు, కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించే అంశాలకు ఓకే చెప్పారు. అన్నపూర్ణ పథకంలో భా గంగా 5 రూపాయల భోజనం అందించే అక్షయపాత్ర సంస్థకు 10 నెలల బిల్లు చెల్లించేందుకు ఆమోదించారు. మున్సిపల్ కమర్షియల్ కాంప్లెక్స్‌ల షట్టర్లకు అద్దె టెండర్లు నిర్వహించేందుకు ఓకే చెప్పారు. ఇంటింటా చెత్త సేకరణ, తాగునీటి సరఫరాలో వినియోగించుకునేందుకు కొత్తగా 250మందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇండోర్, కొచ్చి నగరాల్లో అవలంబిస్తున్న అభివృద్ధి పద్ధతులను అధ్యయనం చేసేందుకు కార్పొరేటర్ల స్టడీ టూర్‌కు కౌన్సిల్ ఓకే చెప్పింది. వీటితో పాటు కార్మికుల పెండింగ్ వేతనాల చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సమావేశంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, తదితరులు పాల్గొన్నారు.
బల్దియా కౌన్సిల్ సమావేశం నుంచి డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్‌తో పాటు బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. సమస్యలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వకుండా మైక్‌లు కట్ చేస్తుండడంతో బీఆర్ఎస్ సభ్యులు పోడియం వైపు దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. దీంతో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వారిని సముదాయించారు. మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. మళ్లీ అదే వివక్ష చూపడంతో మేయర్ వైఖరిని నిరసిస్తూ కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. సొంత పార్టీ కార్పొరేటర్లకు నిధులు కేటాయించి.. విపక్ష కార్పొరేటర్ల డివిజన్లపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.
కౌన్సిల్ సమావేశానికి ముందు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు నిరసనలు చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్‌కు వెళ్లే ప్రధాన గేట్‌కు అడ్డుగా బైఠాయించారు. బీజేపీ కార్పొరేటర్లు మెయిన్ గేట్ ముందు కూర్చొని మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేయర్ పక్షపాత వైఖరి నశించాలంటూ సుమారు అరగంట పాటు బైఠాయించిన బీఆర్ఎస్, బీజేపీ సభ్యులను పోలీసులు సముదాయించి ఆందోళనను విరమింపజేశారు.
నగరాభివృద్దికి ప్రత్యేకంగా వంద కోట్ల నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించాలన్న తీర్మానానికి బల్దియా సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో పాటు వివిధ పథకాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల నిధులను విడుదల చేయాలన్న తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. ఇంటి ఆస్తి పన్ను మదింపు కోసం సెల్ఫ్ అసెస్మెంట్లో తప్పుడు సమాచారం ఇచ్చిన వారికి విధించిన 25 రెట్ల జరిమానాలు మాఫీ చేసేందుకు కౌన్సిల్లో తీర్మానం చేశారు. ఒకే ఇంటికి రెండు నల్లా పన్నులు వస్తున్న వాటి వివరాలు సేకరించి వాటిని రద్దు చేయాలని సమావేశంలో ప్రతిపాదించారు.
వరంగల్ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు బహుముఖ వ్యూహాలను సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారు. 2050 అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తున్నాం. వరంగల్‌ను ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం. వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కృషిచేస్తున్నాం. నగరాభివృద్ధి కోసం రూ. వంద కోట్ల ప్రత్యేక నిధుల విడుదలకు కృషి చేస్తా.
– కొండా సురేఖ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి
వరంగల్ నగరంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రత్యేకంగా డీపీఆర్‌లను సిద్ధం చేస్తున్నాం. స్మార్ట్‌సిటీ, జనరల్ ఫండ్లతో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. నయీంనగర్ నాలా విస్తరణ, బ్రిడ్జి నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేశాం, నగర ముంపు నివారణకు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మహిళా ఆర్థికాభివృద్ధి కోసం బల్దియా ఆధ్వర్యంలో ఆరు ఇందిరా మహిళా క్యాంటీన్లను ప్రారంభిస్తాం.
– గుండు సుధారాణి, మేయర్
బల్దియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని పార్టీల సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం కల్పించాం. నగరాభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. నగరాభివృద్ధికి హైడ్రా లాంటి విధానాలను త్వరలో సీఎం ప్రకటిస్తారు.
– నాయిని రాజేందర్‌రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే
విలీన గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. నిరుపయోగంగా ఉన్న బావులకు మోటర్లు బిగించి వినియోగంలోకి తీసుకురావాలి. బతుకమ్మ పండుగ నేపథ్యంలో గ్రామాల్లో వీధి స్తంభాలకు కొత్త లైట్లు ఏర్పాటు చేయాలి. బతుకమ్మ పండుగ ఏర్పాట్లు చేయాలి
– రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరకాల
15వ ఆర్థిక సంఘం మిగులు నిధులతో చేపట్టనున్న రూ.30 కోట్ల అభివృద్ధి పనులతో పాటు పారిశుధ్య వాహనాల కొనుగోలు ప్రతిపాదనలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మెరుగైన పారిశుధ్య వ్యవస్థ కోసం స్వచ్ఛ ఆటోలు, చెత్త తరలింపు కోసం కంపాక్టర్లు, ట్రాక్టర్లు, కార్మికులకు అందించే పనిముట్ల కొనుగోలు, జంక్షన్ల అభివృద్ధి, వరద కాల్వలు, మురుగు నీటి కాల్వలు, సీసీ బాక్స్ డ్రైన్, సీసీ రోడ్ల నిర్మాణాలకు సైతం ఆమోదం తెలిపారు.
ఖమ్మం, కరీంనగర్ రహదారుల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి. పారిశుధ్య కార్మికుల కొరతను అధిగమించాలి. కొత్తగా 250 కార్మికుల నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలి. యువతను క్రీడల వైపు మళ్లించేందుకు ఇండోర్ స్టేడియాల నిర్మాణాలు చేపట్టాలి.
– కేఆర్ నాగరాజు, వర్ధన్నపేట ఎమ్మెల్యే