రేగొండ/కృష్ణకాలనీ/గణపురం/వెంకటాపూర్/గోవిందరావుపేట, ఆగస్టు 20 : జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని, ఇందుకోసం అవసరమైన నిధులను కేటాయిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క, భూపాలపల్లి, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, నాగరాజు, వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కలిసి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పర్యటించారు.
ఇందులో భాగంగా రేగొండ మండలం కొడవటంచలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ. 12.15 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. రెండో యాదాద్రిగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. అనంతరం తిరుమలగిరి శివారులోని వెంకటేశ్వరస్వామి, ప్రాచీన చరిత్ర కలిగిన పాండవులగుట్టలను పరిశీలించారు. గణపురం మండలం మైలారంలోని సున్నపు గుహలు, గణపసముద్రం చెరువు కట్ట, కోట, రెడ్డి గుళ్లను సందర్శించారు.
కోటగుళ్లలో మొక్కలు నాటారు. అనంతరం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆ పిదప ఆలయ అభివృద్ధిపై కేంద్ర పురావస్తు శాఖ అధికారులతో చర్చించారు. రామప్ప ఆలయం అద్భుతంగా ఉందని కొనియాడారు. అక్కడి నుంచి గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సుకు చేరుకున్నారు. ఉయ్యాల వంతెన మీదుగా ఐలాండ్‌కు చేరుకొని మంత్రులు, అధికారులతో కలిసి సరస్సులో బోటు షికారు చేశారు.
ఉడెన్ కాటేజీలను పరిశీలించి పర్యాటకులకు కల్పిస్తున్న వసతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యాటక పరంగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. మంత్రుల వెంట పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్, ఎండీ ప్రకాశ్‌రెడ్డి, భూపాలపల్లి, ములుగు కలెక్టర్లు రాహుల్ శర్మ, దివాకర, ములుగు ఎస్పీ శబరీష్, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్, భూపాలపల్లి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ములుగు ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.