హనుమకొండ సబర్బన్, సెప్టెంబర్ 13 : గౌరవెల్లి రిజర్వాయర్‌తో హుస్నాబాద్ నియోజకవర్గం మరో కోనసీమగా మారబోతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కాళ్లల్ల కట్టెబెట్టినట్లు వ్యవహరించి కేసులు వేసి ఎన్నో కుట్రలు చేశాయని, వాటిని తిప్పికొట్టి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచి పూర్తి చేసిన ఘనత ఎమ్మెల్యే సతీశ్కుమార్దేనని స్పష్టం చేశారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా రిజర్వాయర్‌ను ప్రారంభించుకొని లక్ష మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకుందామన్నారు.
బుధవారం హుస్నాబాద్‌లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయానికి ప్రారంభోత్సవం, ఏసీపీ, టీఎన్జీవో భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సభలో మాట్లాడారు. 2014కు ముందు హుస్నాబాద్‌లో ఒక్క డివిజన్ స్థాయి కార్యాలయం, రోడ్లు సరిగ్గా ఉండేవి కాదన్నారు. కరువు పీడిత ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజల చెంతకు తెచ్చామన్నారు. దేవాదుల ద్వారా నియోజకవర్గంలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు, మిడ్‌మానేరు ద్వారా చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు సాగు నీరందుతున్నదని చెప్పారు. గౌరవెల్లి ద్వారా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు నీళ్లు రాబోతున్నట్లు తెలిపారు. మహాసముద్రం గండి, గాడుదులొద్దితో చుట్టూ పది ఊళ్లకు నీళ్లు పెరిగాయన్నారు. రిజర్వాయర్ కాల్వల నిర్మాణం పూర్తయి ప్రతి ఎకరానికి సాగు నీరందాలంటే ఎమ్మెల్యేగా వొడితెల సతీశ్‌కుమార్‌ను మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ వచ్చేకంటే ముందు పదేండ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ హుస్నాబాద్ లాంటి మెట్ట ప్రాంతాలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాల మధ్యే పోటీ ఉంటుందని విశదీకరించారు. తెలంగాణలో బీజేపీ దాదాపు బిషానా ఎత్తేసిందని, జమిలి ఎన్నికల పేరుతో మరో నాటకానికి తెరలేపుతున్నదని విమర్శించారు. నూకలు తినమన్న బీజేపీకే నూకలు చెల్లే రోజులొచ్చాయని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధే ఎజెండాగా ముందుకు పోతున్న సీఎం కేసీఆర్‌నే హ్యాటిక్ సీఎంగా తెలంగాణ సమాజం సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుందని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలపై ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలన్నారు.
గులాబీ అడ్డాగా కెప్టెన్ ఇల్లు..
2001లో అప్పటి ప్రభుత్వాన్ని ఎదిరించి గులాబీ జెండాను ఎగురవేసి తెలంగాణ పోరాటానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుడితే ఎవ్వరికీ భయపడకుండా కెప్టెన్ లక్ష్మీకాంతరావు తన ఇల్లును గులాబీ జెండాకు అడ్డాగా మార్చారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులకు నీడనిచ్చి, అన్నం పెట్టి ఆదుకున్న ఘనత కెప్టెన్‌కే చెందుతుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కేవలం ఎమ్మెల్యే సతీశ్కుమార్తోనే సాధ్యమైందన్నారు.
సమస్యలు అధిగమించాం..
బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
తెలంగాణ రాకముందు ప్రజలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు నీళ్లు, కరెంటు అని, ఈ రెండింటినీ సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ తదితర భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయని తెలిపారు. తెలంగాణ రాకముందు 7,778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే ప్రస్తుతం 25వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకొని రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 60మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతియేటా 10వేల మంది వైద్యవిద్యను అభ్యసిస్తున్నారన్నారు. కొట్లాడి సిద్దిపేటకు రైల్వేలైన్, ఎల్కతుర్తి-నాందేడ్ వరకు హైవే రోడ్డును తెచ్చుకున్నట్లు చెప్పారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న సీఎం కేసీఆర్ కావాలో హామీలు ఇచ్చి విస్మరించే కాంగ్రెస్, బీజేపీలు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు.
అప్పుడు కాకతీయులు.. ఇప్పుడు సీఎం కేసీఆర్..
– కెప్టెన్ లక్ష్మీకాంతరావు, రాజ్యసభ మాజీ సభ్యుడు
పల్లెలు బాగుండాలంటే చిన్న నీటి వనరులు పటిష్టండా ఉండాలని అప్పట్లో కాకతీయులు భావించి అనేక చెరువులు, కుంటలను నిర్మిస్తే, ఇప్పుడు సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పేరుతో చెరువులు, కుంటలను అభివృద్ధి చేసి వాటికి ప్రాణం పోశారని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. సమైక్య పాలకులు తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించడం సాధ్యం కాదన్నారని, కానీ భారీ ప్రాజెక్టులను నిర్మించి చూపించిన ఘనత కేసీఆర్‌కే చెందుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ల మాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దని ప్రజలకు సూచించారు. కేసీఆర్ పాలనలో 57ఏండ్ల విధ్వంసానికి తెరపడింది..
వీ ప్రకాశ్, తెలంగాణ నీటి వనరుల
అభివృద్ధి సంస్థ చైర్మన్
57 ఏండ్ల కాంగ్రెస్ పాలనతో తెలంగాణ భారీ విధ్వంసానికి గురైందని, సాగు-తాగు నీరు, కరెంటు లేక ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ విధ్వంసానికి తెరపడిందని తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు భారీ ప్రాజెక్టుల నిర్మాణం, పుష్కలంగా కరెంటు ఉత్పత్తి, పల్లెలు, పట్టణాల సమగ్రాభివృద్ధి రికార్డు స్థాయిలో జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ మళ్లీ కరువు కాటకాల్లోకి వెళ్లడం ఖాయమన్నారు.
రూ.7,752కోట్లతో అభివృద్ధి..
– వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే, హుస్నాబాద్
హుస్నాబాద్ నియోజకవర్గంలో గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో రూ.7,752కోట్లతో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 162గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం, సంక్షేమ పథకాలను వర్తింపజేశామన్నారు. మారుమూల గ్రామాలతో పాటు గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం చేశామన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల సహకారంతో నియోజకవర్గంలో మూడోసారి కూడా గులాబీ జెండా రెపరెపలాడుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, సిద్దిపేట, హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్లు వేలేటి రోజారాధాకృష్ణశర్మ, సుధీర్‌కుమార్, సిద్దిపేట జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీపీ మేకల స్వప్న, జక్కుల అనిత, జడ్పీటీసీ వంగ రవీందర్, భూక్యా మంగ, నాగరాజు శ్యామల, కరీంనగర్ డీసీఎంఎస్ డైరెక్టర్ శ్రీపతి రవీందర్ గౌడ్, గొడిశాల సమ్మయ్య, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.