వరంగల్, ఏప్రిల్ 12 (నమస్తేతెలంగాణ) : ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లాలో ఈ కానుకల పంపిణీని ప్రారంభిస్తారని ప్రకటించారు. అన్నివర్గాలను గౌరవిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పండుగల సమయంలో ప్రతి వర్గానికి కానుకలను అందజేస్తుంది. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుంది. పద్దెనిమిదేండ్ల వయసుపైబడిన ప్రతి మహిళకు పండుగ వాతావరణంలో బతుకమ్మ కానుకగా తీరొక్క చీర అందజేస్తుంది. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేస్తుంది. రంజాన్‌ను పురస్కరించుకుని ముస్లింలకు రంజాన్ కానుకగా గిఫ్ట్ ప్యాక్‌లను అందజేస్తోంది. ముస్లింలకు ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు పక్కా ప్రణాళికతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈసారి ప్రభుత్వం ముస్లింల కోసం రంజాన్ కానుకగా కొద్ది రోజుల క్రితం జిల్లాకు ఆరు వేల గిఫ్ట్ ప్యాక్‌లను కేటాయించింది. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి మూడు వేలు, నర్సంపేట నియోజకవర్గానికి 1,500, వర్ధన్నపేట నియోజకవర్గానికి 1,500 రంజాన్ కానుకలు వచ్చినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి కే విక్రమ్‌కుమార్ వెల్లడించారు. ఈ గిఫ్ట్ ప్యాక్‌లను వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట తాసిల్దార్ కార్యాలయాల్లో భద్రపరిచినట్లు ఆయన తెలిపారు. వీటిని పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్లిం పెద్దలతో మాట్లాడి గిఫ్ట్ ప్యాక్‌లను తహసీల్దార్ కార్యాలయాల నుంచి మసీదు కమిటీలకు పంపుతున్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ రంజాన్ కానుకలను ముస్లింలకు పంపిణీ చేసే పనిలో తలమునకలయ్యారు. ఈ గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే, అధికారులు పాల్గొననున్నారు. రంజాన్ కానుకగా ప్రభుత్వం ముస్లింలకు దుస్తులను గిఫ్ట్ ప్యాక్ ద్వారా అందజేస్తుంది. పురుషుల కోసం లాల్చి, పైజామ, క్లాత్, మహిళల కోసం డ్రెస్ మెటీరియల్ గిఫ్ట్ప్యాక్ల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం పది గంటలకు రాయపర్తి మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేస్తారని అధికారులు వెల్లడించారు. జిల్లాలోని ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాయపర్తి కార్యక్రమంతో జిల్లాలో రంజాన్ కానుకల పంపిణీ ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు.
ఇఫ్తార్ విందుకు నిధులు..
రంజాన్ సందర్భంగా ముస్లింలకు గిఫ్ట్ప్యాక్లతో పాటు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇఫ్తార్ విందు కోసం ప్రభుత్వం జిల్లాకు రూ.12 లక్షలు కేటాయించింది. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి రూ.6 లక్షలు, నర్సంపేట నియోజకవర్గానికి రూ.3 లక్షలు, వర్ధన్నపేట నియోజకవర్గానికి రూ.3 లక్షల చొప్పున కేటాయించినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి కే విక్రమ్‌కుమార్ తెలిపారు. ఈ నెల 15 నుంచి ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఇఫ్తార్ విందు ఏర్పాటు కోసం అధికారులు ముస్లిం పెద్దలతో మాట్లాడుతున్నారు. ఈ ఇఫ్తార్ విందుల్లోనూ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు.