వరంగల్, జూలై 29 : భద్రకాళీ చెరువు కట్టకు పడిన గండికి అధికార యంత్రాంగం గంటలోనే మరమ్మతు చేసింది. శనివారం పోతన నగర్ వైపు చెరువు కట్టకు గండి పడింది. సమాచారం తెలుసుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేపట్టారు. గంటలోనే గండి నుంచి వరద బయటికి వెళ్లకుండా అదుపులోకి తీసుకొచ్చారు. గండికి అడ్డుగా బండరాళ్లు పేర్చి, బంక మట్టి, ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి, వరద బయటికి వెళ్లకుండా అదుపులోకి తీసుకొచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రకాళి చెరువులోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో చెరువు పాత కట్టకు గండి పడింది. దీనిని గమనించిన అధికారులు వెంటనే స్పందించి పూడ్చివేత పనులను చేపట్టారు.
ఫాలింగ్ షట్టర్ల మూసివేత
భద్రకాళి చెరువులోకి వరద నీటిని వదిలేందుకు హంటర్‌రోడ్ వైపు ఏర్పాటు చేసిన ఫాలింగ్ షట్టర్లను బల్దియా అధికారులు మూసివేశారు. చెరువు కట్టకు పోతననగర్ వైపు గండి పడడంతో పైనుంచి వచ్చే వరదను తగ్గించేందుకు ఈ షట్టర్‌ను మూసివేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో బొందివాగు నాలా నుంచి వచ్చే వరద నీటిని భద్రకాళీ చెరువులోకి వదిలేందుకు ఫాలింగ్ షటర్లను తెరిచారు. దీంతో భారీగా వరద నీరు చెరువులోకి చేరింది. ప్రస్తుతం పోతననగర్ వైపు కట్టకు గండి పడడంతో అధికారులు ఫాలింగ్ షట్టర్లను మూసివేయగా వరద నీరు తగ్గింది. దీంతో తెగిన కట్ట మరమ్మతు పనులు చేయడం సులువుగా మారింది.
యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు
యుద్ధ ప్రాతిపదికన భద్రకాళి చెరువు కట్ట మరమ్మతు పనులు చేపట్టారు. గండిపడిన విషయాన్ని గమినించి అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. వెంటనే గండికి అడ్డుగా జేసీబీల సాయంలో పెద్ద పెద్ద బండరాళ్లను వేశారు. బంకమట్టి, ఇసుక బస్తాలను అడ్డుగా వేశారు. గండి పడిన గంట సమయంలో వరద బయటికి వెళ్లకుండా అదుపులోకి తీసుకొచ్చారు. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు అధికారులు మరమ్మతు చర్యలు చేపట్టారు.
పునరావాస కేంద్రాలకు సమీప కాలనీ ప్రజలు
భద్రకాళి చెరువు కట్టకు గండి పడడంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. చెరువు కట్టకు సమీప కాలనీల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించారు. పోతననగర్ కాలనీ, సరస్వతీ నగర్ కాలనీలను ఖాళీ చేయించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలోకి సమీప కాలనీ ప్రజలను తరలించారు. కాలనీలోని ప్రజలు స్వచ్ఛందగానే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి దయాకర్‌రావు
భద్రకాళి చెరువు కట్టకు గండిపడిన సమాచారం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హుటాహుటిన వచ్చారు. చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి వచ్చిన ఆయన చెరువు కట్టకు పడిన గండిని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. వెంటనే గండిని పూడ్చివేయాలని ఆదేశించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు జరుగుతున్నాయన్నారు. ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. ఆయన వెంట శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్ తదితరులు ఉన్నారు.