దేవరుప్పుల, నవంబర్ 14 : పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య, వసతులు అందిస్తున్నందున దీనిని వినియోగించుకుని చదువులో రాణించి తల్లిదండ్రుల కలల ను సాకారం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల గురుకుల విద్యాలయం లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థినులతో కలిసి కింద కూర్చుని వారితో మమేకమయ్యారు. దివంగత మాజీ ప్రధాని నెహ్రూ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి విద్యార్థినులకు తినిపించారు. అనంతరం జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, ఎంపీపీ బస్వ సావిత్రి, సర్పంచ్ ఈదునూరి రమాదేవితో కలిసి విద్యార్థినులతో మాట్లాడారు. పేద కుటుంబాలకు చెందిన మీ రు ప్రభుత్వం కల్పించిన వసతులను ఉపయోగించుకుని చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎర్రబెల్లి కోరారు. గతంలో మీకు ఇచ్చిన మాటకు కట్టుబడి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చానని, మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తానున్నానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ ఇక్కడ వసతులు బాగున్నాయని తెలిపారు.
వంట సామగ్రి అందించిన జడ్పీటీసీ
జడ్పీటీసీ పల్లా భార్గవి రూ.లక్ష వె చ్చించి కొనుగోలు చేసిన వంట సామగ్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా కస్తూర్బా గాంధీ విద్యాలయానికి అందించారు. ఇదే గ్రామానికి చెందిన దాట్ల యాకన్న డస్ట్బిన్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకన్న మైక్ సెట్‌ను బహూకరించారు.
బాలయేసు విద్యార్థులతో సరదాగా..
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బాలయేసు ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల విద్యార్థులు మహనీయుల వేషధారణతో ప్రదర్శన ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లి వారిని చూసి ముచ్చటపడ్డారు. వారికి విదేశీ చాక్లెట్లను పంచి అక్కున చేర్చుకున్నారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులను ఎర్రబెల్లి కోరారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ సుకన్య, మండల ప్రజాప్రతినిధులు పల్లా సుందరాంరెడ్డి, బస్వ మల్లేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ పాల్గొన్నారు.